- కులాంతర వివాహ సహాయానికి బడ్జెట్ లో రూ.10 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో రూ.20 కోట్లు కేటాయించింది. తెలంగాణలో కులాంతర వివాహ చేసుకున్న జంటలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులను వివిధ జిల్లాలకు ఎస్సీ వెల్ఫేర్ అధికారులు బదిలీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన వాటా కలిగిన ఈ సొమ్ము సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో నేరుగా జమ కానుంది.
అత్యాచార బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు హైదరాబాద్ జిల్లాకు రూ.కోటీ 60 లక్షలు, జోగులాంబ గద్వాల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కోటి చొప్పున నిధులు కేటాయించారు.
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఒక్కో జంటకు రూ.2.5 లక్షలను ప్రభుత్వం ప్రొత్సాహకంగా చెల్లించనుంది. జగిత్యాల జిల్లాకు రూ.కోటీ 75 లక్షలు, జోగులాంబ గద్వాలకు కోటీ 25 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రూ.90 లక్షల చొప్పున అత్యధికంగా కేటాయించారు. ఈ రెండింటికి బడ్జెట్ లో నిధులు కేటాయించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
