
విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేలా ఉమ్మడి ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. బేగంపేట సీఎం క్యాంప్ కార్యాలయంలో 6 గంటలకు పైగా సమావేశమైన కేసీఆర్, జగన్.. విభజన సమస్యలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. సమావేశం నుంచే CSలకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు ప్రయోజనం కలిగేలా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ నిర్ణయించారు. కృష్ణా నది నీటి లభ్యతలో ప్రతీ ఏడాది అనిశ్చిత పరిస్థితులు వస్తున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 వ షెడ్యూల్ లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఏపీ సీఎం జగన్ కు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. జగన్ ప్రతినిధి బృందంతో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 6 గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సమావేశంలో చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతీ ఏడాది ఒకేలా లేకపోవడంతో ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇచ్చే ఆలోచన చేయాలన్నారు. ఇప్పటికే సిద్దంగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలని నిర్ణయించారు. ఇందుకు తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చనే అభిప్రాయానికి వచ్చారు కేసీఆర్,జగన్. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి? అనే విషయాలపై వచ్చే సమావేశంలో మరింత చర్చించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు.