
- ఆనాడు ఏపీ ఏర్పాటు వల్ల మాకు రావాల్సిన 174 టీఎంసీలు నష్టపోయాం
- కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు
- ఆల్మట్టి ఎత్తు పెంపుతో 60 టీఎంసీలు ఇస్తామని కర్నాటక చెప్పినా ఉమ్మడి ఏపీ సర్కార్ ఒప్పుకోలేదు
- సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 5.4 లక్షలకు తగ్గించారు
- అదే టైమ్‌లో ఏపీలో 1.3 లక్షల నుంచి 3.8 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచారని వెల్లడి
- వాదనలకు మరో రెండ్రోజులు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
- ట్రిబ్యునల్ ఓకే.. ఆగస్టు 28, 29కి విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్లకుండా కొన్ని దశాబ్దాల పాటు అన్యాయం చేశారని, దీంతో లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకోవడం అనివార్యంగా మారిందని కృష్ణా ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర సర్కార్ వాదనలు వినిపించింది.
1956లో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన 174.3 టీఎంసీలు నష్టపోయినట్టు వెల్లడించింది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో గాని, బచావత్ట్రిబ్యునల్ఎదుటగాని ఉమ్మడి ఏపీ సరైన వాదనలు వినిపించలేదని ఆక్షేపించింది. శుక్రవారం బ్రజేశ్ కుమార్ట్రిబ్యునల్(కృష్ణా వాటర్డిస్ప్యూట్స్ట్రిబ్యునల్2) ముందు తెలంగాణ తరఫు అడ్వొకేట్లు, అధికారులు మూడో రోజు వాదనలు వినిపించారు. తెలంగాణకు లిఫ్ట్‌ల అవసరం ఎలా వచ్చిందో వివరించారు. శ్రీశైలం లెఫ్ట్బ్యాంక్కెనాల్(ఎస్ఎల్‌బీసీ), కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీమ్‌లకు 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా నికర జలాలను కేటాయించాలని డిమాండ్‌చేశారు.
కర్నాటక నీళ్లు ఇస్తామన్నా ఏపీ ఒప్పుకోలేదు..
ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్నాటక 2009–2010లో ఉమ్మడి ఏపీకి పరిష్కార మార్గం చూపించిందని అడ్వొకేట్లు ట్రిబ్యునల్‌కు వివరించారు. ఎత్తు పెంపు ద్వారా ఆల్మట్టిలో పెరిగే స్టోరేజీ నుంచి 60 టీఎంసీలను వినియోగించుకోవచ్చని ఆఫర్ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని, ఆ ప్రతిపాదనలు తిరస్కరించిందని పేర్కొన్నారు. ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఉండి ఉంటే, ఆ 60 టీఎంసీలు దక్కేవని స్పష్టం చేశారు.
ఆల్మట్టి ప్రాజెక్టు కెనాల్స్ద్వారా గ్రావిటీతో మరిన్ని నీళ్లను తరలించుకునేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పేచీ వల్ల తెలంగాణకు ఆ 60 టీఎంసీల నష్టం జరిగిందన్నారు. అంతేగాకుండా ఉమ్మడి ఏపీలో నాగార్జునసాగర్ఎడమ కాల్వ కింద ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 5.4 లక్షల ఎకరాలకు తగ్గించారని ట్రిబ్యునల్‌కు వివరించారు. తద్వారా ఎడమ కాల్వ కింద నీటి కేటాయింపులు తగ్గించారన్నారు.
కరువు ప్రాంతాలకు నీళ్లివ్వాలి..
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టుల గురించి ట్రిబ్యునల్‌కు అడ్వొకేట్లు వివరించారు. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయాలని కోరారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్లివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఇప్పటికే ఇతర బేసిన్‌ల ద్వారా సరిపోనూ నీళ్లను తీసుకెళ్తున్నదని వివరించారు. ఏపీకి ఇప్పుడు తీసుకెళ్తున్న దానికన్నా తక్కువ నీళ్లే సరిపోతాయని చెప్పారు.
నీళ్లను అందరి అవసరాలను తీర్చడం కోసం వాడుకోవాలేగానీ.. దురాశతో దోచుకెళ్లడానికి కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై వివరాలు ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించగా.. వచ్చే సెషన్‌లో సమర్పిస్తామని అడ్వొకేట్లు కోరారు. తమ వాదనలు వినిపించేందుకు మరో రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అవకాశం ఇచ్చిన ట్రిబ్యునల్.. తదుపరి విచారణను ఆగస్టు 28, 29 తేదీలకు వాయిదా వేసింది.