రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : సుదర్శన్రెడ్డి 

 రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : సుదర్శన్రెడ్డి 
  • ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి 

ఎడపల్లి, వెలుగు : ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వ  సలహాదారు, ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై ధూపల్లి గ్రామ క్రాసింగ్ దగ్గర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అలైవ్, అరైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వాహనదారులకు హెల్మెట్లు అందజేసిన అనంతరం మాట్లాడారు.  దూపల్లి గేట్​ క్రాసింగ్ ను బ్లాక్ స్పాట్ గా పోలీసులు గుర్తించారని,  ఇక్కడ ఆర్ అండ్ బీ శాఖ  స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని సూచించారు.  మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎడపల్లి గురుకుల పాఠశాల సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో గురుకుల విద్యార్థులతో వాహనదారులకు హెల్మెట్లు అందించామన్నారు. కార్యక్రమంలో బోధన్ సీఐ విజయ్ బాబు, ఎడపల్లి, బోధన్, రెంజల్ ఎస్సైలు ముత్యాల రమ, మచ్ఛేందర్ రెడ్డి, రఘుపతి,  పీఈటీ ప్రసూన పాల్గొన్నారు.  

కోటగిరిలో..

కోటగిరి : కోటగిరిలో బుధవారం అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రూర్​సీఐ కృష్ణ, కోటగిరి ఎస్సై సునీల్​ జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేసి మాట్లాడారు. హెల్మెట్లు ధరిస్తే ప్రాణాపాయం తప్పుతుందన్నారు. బైక్​పై తిరిగే జర్నలిస్టులు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. సెల్​ఫోన్​ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడుపొద్దన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హన్మంతు, కోటగిరి సర్పంచ్ బర్ల మధు, స్థానిక నాయకులు దావులయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్, సీనియర్ జర్నలిస్టులు సాయిలు, హన్మంత్‌‌‌‌రావు పాల్గొన్నారు.

మోపాల్ మండల కేంద్రంలో.. 

మోపాల్ : మోపాల్ మండల కేంద్రంలో బుధవారం ట్రాఫిక్​రూల్స్​పై పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మోపాల్​ ఎస్సై సుస్మిత మాట్లాడుతూ బైక్​నడిపేవారు హెల్మెట్​, కారు నడిపేవారు సీటు బెల్ట్​తప్పక ధరించాలన్నారు.  

వర్నిలో..

వర్ని :  అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వర్ని పోలీస్ స్టేషన్ లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం రుద్రూర్ బస్టాండ్​ ప్రాంతంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ శ్రీరామరక్ష అని సూచించారు.