హైకోర్టు, రాజ్ భవన్ ఖర్చుల్లో మీ వాటా ఇవ్వండి

హైకోర్టు, రాజ్ భవన్ ఖర్చుల్లో మీ వాటా ఇవ్వండి

ఏపీకి రాష్ర్ట ఆర్థిక శాఖ లెటర్

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో ఏపీ వాటా ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ర్ట ప్రభుత్వానికి ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఏపీ తన వాటాగా రూ.290 కోట్లు చెల్లించాల్సిందిగా పేర్కొంది.

ఒక్క హైకోర్టుకే రూ.230 కోట్లు

ఏపీ విభజన జరిగిన తర్వాత కొంతకాలంపాటు హైదరాబాద్ నుంచే ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగాయి. సెక్రటేరియట్, అసెంబ్లీ, శాసనమండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, లోకాయిక్త, మహిలా కమిషన్ తోపాటు విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ లో ఉన్న 33 సంస్థల పాలన హైదరాబాద్ నుంచే కొనసాగింది. తర్వాత రెండు రాష్ర్టాలకు విభజించారు. ఈ క్రమంలో ఉమ్మడిగా కొనసాగిన హైకోర్టు, రాజ్ భవన్ ఇటీవల విడిపోయాయి. ఏపీ హైకోర్టు ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమైంది. కేంద్రం ఈ మధ్య ఏపీకి గవర్నర్ ను నియమించడంతో అక్కడ రాజ్ భవన్ ఏర్పాటయింది. ఈ నేపథ్యంలో ఏపీ విభజన నాటి నుంచి హైకోర్టుకు, రాజ్ భవన్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో 42:58 నిష్పత్తి ప్రకారం ఏపీ రూ.290 కోట్లు (58 శాతం) బాకీ ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. రాజ్ భవన్ నిర్వహణకు ఖర్చు చేసిన నిధుల్లో రూ.25 కోట్లు, హైకోర్టుకు ఖర్చు చేసిన నిధుల్లో రూ.230 కోట్లను ఏపీ చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇవి కాక తెలంగాణ విద్యుత్ డిస్కంలకు ఏపీ రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉందని ఉన్నతాధికారులు తేల్చారు. ఏపీలో గత ప్రభుత్వంలో ఈ బకాయిలు చెల్లింపు విషయంలో వివాదం కొనసాగింది. ఈ బకాయిలు వస్తే కొంత ఆర్థిక ఇబ్బందుల నుంచి డిస్కంలు గట్టెక్కే అవకాశాలు కనపడుతున్నాయి.