
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. నాలుగు రోజుల గ్యాప్ తర్వాత శనివారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదిరోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల 22 వరకు ఒక్క రోజు గ్యాప్ లేకుండా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి.. శనివారం, ఆదివారం రెండు సభల్లో బడ్జెట్ పై చర్చ జరగనుండగా.. ఆదివారం మధ్యాహ్నం బడ్జెట్‌పై సభ్యుల సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ఇక సోమవారం నుంచి వరుసగా ఆరు రోజులు వివిధ శాఖల పద్దులపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల చివరి రోజైన ఈ నెల 22న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి.. అదేరోజు ఆమోదించటంతో సమావేశాలు ముగుస్తాయి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ శనివారం బడ్జెట్ పై చర్చను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ లో అధికార టీఆర్ ఎస్ తర్వాత ఎంఐఎం కు అధిక ఎమ్మెల్యేలు ఉండటంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ( పీఏసీ) చైర్మన్ పదవి ఎంఐఎంకు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై శనివారం స్పీకర్ ప్రకటన చేసే చాన్స్ ఉంది. అదేవిధంగా అసెంబ్లీ, కౌన్సిల్ లో పలు కమిటీలకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.