
- హంగ్ వస్తుందన్న బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్
- తామే కీలకంగా మారుతామని కామెంట్
- గ్యారంటీలు తమనే గెలిపిస్తాయంటున్న కాంగ్రెస్
- హ్యాట్రిక్ కొడ్తామంటున్న బీఆర్ఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హంగ్‌పై చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మెజార్టీ రాకపోవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల లీడర్లు కూడా హంగ్ దిశగా ఫలితాలు ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నారు. వివిధ ఏజెన్సీలు నిర్వహిస్తున్న ఎన్నికల సర్వేల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ అంచనాలన్నీ.. పొలిటికల్ సర్కిల్స్‌లో ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు మూడో ఎన్నికను ఎదుర్కొంటున్నది. హ్యాట్రిక్ సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, మార్పును కోరుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. గతంతో పోలిస్తే కర్నాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవటం, మూడేండ్లుగా రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఈసారి పొలిటికల్ సీన్ మారిపోయింది. అధికార బీఆర్ఎస్కు ప్రతిపక్షాల నుంచి టైట్ ఫైట్ ఉంటుందన్న అభిప్రాయాలు అందరినోటావినిపిస్తున్నాయి.
ఎవరి సర్వేలు వాళ్లకు అనుకూలమే.. కానీ..!
రాష్ట్రంలో అసెంబ్లీలో 119 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఏదైనా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు (మేజిక్ ఫిగర్) ఉండాలి. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోతే.. హంగ్ ఏర్పడుతుంది. అప్పుడు ఇతరుల మద్దతుతో మేజిక్ ఫిగర్ సాధించేందుకు పార్టీలు పోటీ పడుతాయి. ఈసారి రాష్ట్రంలో అటువంటి పరిస్థితే ఎదురవుతుందని జాతీయ, స్థానిక సర్వే ఏజెన్సీలన్నీ తమ అంచనాల్లో పేర్కొంటున్నాయి.
అయితే.. పార్టీ అఫిలియేటెడ్‌గా సర్వేలు చేస్తున్న ఏజెన్సీలన్నీ ఎవరికివారే అధికారంలోకి వస్తారన్నట్లుగా తమ రిపోర్టులను పబ్లిక్‌లోకి వదులుతున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా చేస్తున్న సర్వేల్లో పోటా పోటీ ఉంటుందన్న రిజల్ట్స్ వస్తున్నాయి. మూడు నుంచి ఐదు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని పలు ఏజెన్సీలు నివేదిస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని చెప్తుండగా.. ఇంకొన్ని ఏజెన్సీలు కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని నివేదిస్తున్నాయి. హంగ్ ఏర్పడుతుందని పలు సంస్థల రిపోర్టులు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కీలకం కాబోతుందని ఆ పార్టీలోని అత్యంత కీలక నేత బీఎల్ సంతోష్ చేసిన కామెంట్స్ ఉత్కంఠకు దారితీశాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్‌తో పాటు పలు సర్వే సంస్థల నివేదికలను చూసిన తర్వాతే ఆయన ఈ కామెంట్స్ చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదటిసారి బొటాబొటీ... రెండోసారి విక్టరీ
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 63 సీట్లలో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 15 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు, బీజేపీ నుంచి ఐదుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అసెంబ్లీ కాల పరిమితి ఇంకో ఏడు నెలలు ఉండగానే కేసీఆర్ 2018 సెప్టెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 88 సీట్లతో బీఆర్ఎస్ భారీ విజయం నమోదు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎంఐఎం ఏడు సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకోగా టీడీపీ రెండు సీట్లకు, బీజేపీ ఒక స్థానానికి పడిపోయాయి. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ గా ఒకరు విజయం సాధించారు. ఈసారి డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అప్పటి వరకు తాము మరింత బలం పుంజుకుంటామని కాంగ్రెస్, బీజేపీ ఆశలు పెట్టుకోగా.. కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టగానే ఇప్పుడు కనిపిస్తున్న వ్యతిరేకత తగ్గిపోతుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్నది.
మూడు పార్టీల్లో ఇట్ల..!
కేసీఆర్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నరేండ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నట్టు పలు జాతీయ, ప్రాంతీయ సర్వే ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎక్కువ మంది సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. వాళ్లపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని, ఇదే అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు తెచ్చిపెడుతుందని సర్వే ఏజెన్సీలతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చింది.
తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో తాము పవర్లోకి రావడం పక్కా అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. సొంతంగానే అధికారంలోకి వస్తామని పైకి చెప్తున్నా.. ఇంటర్నల్ డిస్కషన్స్ లో మాత్రం హంగ్ అసెంబ్లీనే అని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. తెలంగాణలో రాబోయేది హంగ్ అసెంబ్లీనే అని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అభిప్రాయపడ్డారు. అప్పుడు బీజేపీనే కీలకమవుతుందని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
మూడేండ్లుగా తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుంది. మూడోసారి తమనే గెలిపించాలంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. బీఎల్ సంతోష్ కామెంట్స్ మైండ్ గేమ్అని.. తెలంగాణలో కచ్చితంగా పవర్లోకి రాబోయేది బీఆర్ఎస్సేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. దక్షిణాదిన హ్యాట్రిక్ కొట్టే సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు.