ఎవరు అలర్టు కావొద్దనే కేసీఆర్ డ్రామాలు

ఎవరు అలర్టు కావొద్దనే కేసీఆర్ డ్రామాలు
  • హుజూరాబాద్​ బైపోల్​ తర్వాత టీఆర్​ఎస్​లో తిరుగుబాటు
  • గుజరాత్‌తో పాటే తెలంగాణకు ఎన్నికలు 
  • హుజూరాబాద్​ బైపోల్​ తర్వాత టీఆర్​ఎస్​లో తిరుగుబాటు
  • అందుకే సభలు, ప్లీనరీ అంటూ హడావుడి
  • హరీశ్​రావును బయటకు పంపుతరని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు : సీఎం కేసీఆర్​ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని, గుజరాత్​ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి చెప్పారు. హుజూరాబాద్​ ఎన్నికల తర్వాత టీఆర్​ఎస్​లో చాలా మార్పులు వస్తాయని, ఆ పార్టీలో తిరుగుబాటు వస్తుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్​ సభలు, ప్లీనరీ అంటూ హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్​కు భయం పట్టుకుందని, ఆ భయాన్ని బయటపడనీయకుండా ఉండేందుకే విజయ గర్జన సభ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు కేసీఆర్​ సాధించిన విజయాలు ఏమున్నాయని సభ పెడుతున్నరు? టీఆర్​ఎస్​కు ఇవే చివరి సభలు అవుతయ్. ముందస్తు రాదని కేసీఆర్​ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది” అని అన్నారు.
‘‘పార్లమెంట్​, అసెంబ్లీ ఎన్నికలు కలిసి రావు. నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తయ్​. ముందస్తు ఎన్నికలంటే పార్టీలో మరింత గందరగోళం వస్తుందని కేసీఆర్​ మాట మార్చి చెప్తున్నరు.  ఆ పార్టీకి ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే నాయకులు ముందస్తుగా అలర్ట్​ కాకుండా కేసీఆర్​ డ్రామా ఆడుతున్నరు. కానీ, టీఆర్​ఎస్​లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమే” అని రేవంత్​ చెప్పారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. సర్కార్​ను నడపాల్సిన సమయంలో కేసీఆర్​ పార్టీపై  దృష్టి సారిస్తున్నారంటేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ‘‘ముందస్తు ఎన్నికల గురించి ఎవరూ అడగకున్నా కేసీఆర్​ తనంతట తాను ప్రస్తావించారు. మంత్రి హరీశ్​ రావును  కేసీఆర్​ త్వరలో పార్టీ నుంచి బయటకు పంపుతరు.  2022 ఆగస్టు 15 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లవుతుందని, ఈ సందర్భంగా కేసీఆర్​ ఎన్నికలకు వెళ్తారు” అని అభిప్రాయపడ్డారు.  మోడీ డైరెక్షన్​లో కేసీఆర్​ ఎన్నికలకు వెళ్తారని, గుజరాత్​తోపాటే తెలంగాణ ఎన్నికలు వస్తాయన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. హుజూరాబాద్​లో ఈటల గెలిచినా, ఓడినా ఎవరికీ లాభం లేదన్నారు. యూపీ ఎన్నికల్లో కేసీఆర్​ బీజేపీకి సహకరిస్తారని, దాని వెనక అంతర్గత ఒప్పందం కుదిరిందన్నారు. 
దళిత బంధును ఎగ్గొడ్తడు
సీఎం కేసీఆర్​ దళిత ద్రోహి అని, ఆయన పార్టీలో వాళ్లకు ప్రాధాన్యతే లేదని రేవంత్​ అన్నారు. దళిత బంధును కేసీఆర్​ ఎగ్గొట్టే స్కీంగా మారుస్తారని ఆయన విమర్శించారు. దళితులు వాస్తవానికి ఏబీసీడీ వర్గీకరణ చేయాలని అడిగారని, ఈ విషయాన్ని కేసీఆర్​ పట్టించుకోలేదన్నారు. ప్రధాని మోడీని ఎన్నో సార్లు కలుస్తున్న కేసీఆర్​ ఎందుకు వర్గీకరణ గురించి ఆయనను అడగడం లేదని రేవంత్​ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్​ వేసే సమయంలో ఒక్క దళితుడు కూడా ఆయనతో లేరన్నారు.