
హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ కావాలనే చిల్లర రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. మంత్రి సీతక్కపై కావాలనే అభ్యంతకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని పొన్నం చెప్పారు. కావాలనే సభలో రచ్చ చేస్తే ఎట్లా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిపై నిలదీశారు. మహిళలను అందరూ గౌరవించాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. కొన్ని చట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయని, ప్రజల భావస్వేచ్ఛకు ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. సివిల్ లా బిల్లును సమర్థిస్తున్నామని, తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చొద్దని కేటీఆర్ హితబోధ చేశారు. రేప్ కేసుల్లో త్వరగా శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని కేటీఆర్ సూచన చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. న్యాయ చట్టాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే ఛాన్స్ ఉందని, చట్టాల విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి తెలిపారు. ఉద్యోగాల భర్తీ వెంటనే జరగాలని, కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలని కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.