డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

 తెలంగాణలో మూడో అసెంబ్లీ మొదటి సెషన్ ​శనివారం(డిసెంబర్ 9) ప్రారంభం కానుంది. నాలుగో రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సెషన్​ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని  ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ  కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 9వ తేదీ ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు.  కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ స్పీకర్​ఎన్నిక కోసం నోటిఫికేషన్​జారీ చేస్తారు. ఆదివారం లేదా సోమవారం స్పీకర్​ఎన్నికను నిర్వహిస్తారు. స్పీకర్‌‌‌‌గా వికారాబాద్​ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌ను కాంగ్రెస్ హైకమాండ్​ఇప్పటికే ప్రకటించింది. ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

స్పీకర్‌‌‌‌గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాసేపు సభను నడిపిస్తారు. మరుసటి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్​ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతారు.