
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సమావేశం ప్రారంభం కాగానే.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు.
ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం బీఏసీ సమావేశం ని ర్వహించి.. అసెంబ్లీని ఎన్ని రోజులపాటు జరపాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, అదే రోజు శాసన మండలి కూడా ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎమ్మెల్సీలకు సైతం కాళేశ్వరం కమిషన్ ప్రతులు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అసెంబ్లీ కమిటీ హాల్లోనే కేబినెట్ భేటీ
అసెంబ్లీ ప్రారంభమయ్యే 30న మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్లోనే సీఎం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. 29న సెక్రటేరియెట్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల రీ షెడ్యూల్ చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతో పాటు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టేందుకు కేబినెట్ అప్రూవల్ తీసుకోనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపైనా కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.