-
పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు ఏటీసీ కోర్సులు: మంత్రి వివేక్
- ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడం గొప్ప ముందడుగు
- ప్రిన్సిపాల్స్ అంతా అంకితభావంతో పనిచేయాలని సూచన
- ఏటీసీ ప్రిన్సిపాల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు హాజరు
- హైదరాబాద్, వెలుగు:
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు)లు కీలకపాత్ర పోషించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. రాబోయే రెండేండ్లలో ఈ సెంటర్ల ద్వారా 2 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడం గొప్ప ముందడుగు అని, ఈ చర్య త్వరలోనే సత్ఫలితాలు ఇస్తుందని, సీఎం చొరవతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఎంసీ హెచ్ఆర్‌డీలో ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఏటీసీ ప్రిన్సిపాల్స్ శిక్షణ కార్యక్రమానికి వివేక్ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. లక్ష్యాలను సాధించేందుకు ప్రిన్సిపాల్స్ అందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ‘‘ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం మొదటి ప్రాధాన్యత కావాలి.
ఏటీసీల్లో ప్రవేశపెట్టిన కోర్సులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. అవి మరో 10 నుంచి 15 ఏండ్ల వరకు ఉపయోగపడేలా అవసరమైన మార్పులతో రూపొందించాలి. విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్దేశించి వారు విజయం సాధించేలా శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. క్రమశిక్షణ, ఏటీసీల నిర్వహణ అంశాలపై ప్రాధాన్యత ఇవ్వాలి. ఏటీసీల ద్వారా అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దే పెద్ద బాధ్యత ప్రిన్సిపాల్స్, ట్రైనర్లపై ఉంది’’అని మంత్రి వివేక్ తెలిపారు.
లక్ష్య సాధన కోసం సమన్వయంతో పని చేయాలి
లక్ష్య సాధన కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. అలాగే, ఏటీసీల పనితీరును క్రమబద్ధీకరించేందుకు హాజరు శాతం పెంచడం, డ్రాపౌట్స్ తగ్గించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా నిరంతరం సమన్వయంతో ఉండాలని సూచించారు.
‘‘ఏటీసీలు సత్ఫలితాలను ఇస్తే సీఎస్‌ఆర్‌లో భాగస్వాములైన టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో కలిసి ముందుకు సాగేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఏటీసీల లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తున్న ప్రిన్సిపాల్స్, ట్రైనర్లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది’’అని వివేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్, ఉపాధి, శిక్షణ శాఖ జేడీ ఎస్వీకే నగేశ్, టాటా గ్రూప్ ప్రతినిధులు, ఏటీసీల ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొన్నారు.
