అటకెక్కిన ‘బాలికా ఆరోగ్య రక్ష’ స్కీమ్​

అటకెక్కిన ‘బాలికా ఆరోగ్య రక్ష’ స్కీమ్​

హైదరాబాద్, వెలుగు: బాలికల ఆరోగ్యం కోసం నాలుగేండ్ల కింద తెలంగాణ సర్కారు ప్రారంభించిన ‘బాలికా ఆరోగ్య రక్ష’ స్కీమ్​ అటకెక్కింది. కేవలం ఒక్క ఏడాదే దీన్ని అమలు చేసి ఆ తర్వాత చేతులెత్తేసింది. అసలు ఈ స్కీమ్​ను ఎందుకు ఆపేశారనే దానిపై ఆఫీసర్లు ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. రాష్ట్రంలో సర్కారు విద్యాసంస్థల్లో ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే బాలికల ఆరోగ్యం కోసం 2018లో  ప్రభుత్వం ‘బాలికల ఆరోగ్య రక్ష కిట్స్‌‌’ పథకం ప్రారంభించింది. గవర్నమెంట్ స్కూల్స్​తో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు ఈ స్కీమ్ కింద హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌‌ అందించనున్నట్టు వెల్లడించింది. పథకంలో భాగంగా 2018-–19 అకడమిక్​ ఇయర్​లో ప్రతి మూడు నెలలకోసారి ఏటా నాలుగు సార్లు బాలికలకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఆ ఏడాది రాష్ట్రంలో 5.90లక్షల మందికి కిట్లను పంపిణీ చేశారు. 

ఎంతో మేలు చేసిన కిట్స్
చాలా మంది నిరుపేద బాలికలకు హెల్త్ కిట్లు ఎంతగానో మేలు చేశాయి. సర్కారు విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్లు అందరూ పేదవారే. ఈ స్కీమ్ ద్వారా అందే వస్తువులు వారికి ఆ ఏడాది బాగా ఉపయోగపడ్డాయి. ఒక్కో కిట్​లో రూ.420 విలువైన వస్తువులను ఇచ్చారు. శానిటరీ నాప్కిన్స్, సబ్బులు, కొబ్బరినూనె, షాంపూబాటిల్, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్ తదితర 13 రకాల వస్తువులు ఇచ్చారు. మోడల్ స్కూల్స్, కేజీబీవీ హాస్టళ్లలోని స్టూడెంట్లకు ఇవి ఒక రకంగా ఎంతో ఆసరాగా నిలిచాయి. ఒక్క ఏడాది కిట్లు అందజేసిన ప్రభుత్వం ఆ తర్వాతి నుంచి పంపడం నిలిపి వేసింది. ప్రస్తుతం కిట్లు రాకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. హైజీన్​కిట్లు ఆరోగ్యపరంగా బాలికలకు ఎంతో ఉపయోగపడేవని కేజీబీవీ టీచర్లు అంటున్నారు. సర్కారు ఎందుకు ఇవ్వడం లేదో తమకు కూడా తెలియదని వాపోతున్నారు.