అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ .. లోక్​సభ ఎన్నికల వేగం పెంచిన బీజేపీ

అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ  .. లోక్​సభ ఎన్నికల వేగం పెంచిన బీజేపీ
  • పార్టీ మండల అధ్యక్షులు, ఆ పైస్థాయి నేతల ఒపీనియన్​ నమోదు 
  • రెండు రోజుల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి రిపోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీజేపీ లోక్​సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్పీడప్ చేస్తున్నది. నాలుగు రోజులుగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలను  నిర్వహిస్తున్న ఆ పార్టీ.. ఆ సమావేశంలోనే ఎంపీ టికెట్ ఎవరికిస్తే బాగుంటుందనే అభిప్రాయాలను పార్టీ నేతల నుంచి స్వీకరిస్తున్నది. రాష్ట్ర పార్టీ నుంచి ఇద్దరు ఆఫీసు బేరర్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ కు పంపిస్తున్న రాష్ట్ర నాయకత్వం, ఆ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతల నుంచి అభిప్రాయాలను స్వీరిస్తున్నది.

ఇప్పటికే15 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ అభిప్రాయ సేకరణ పూర్తయినట్లు రాష్ట్ర పార్టీ నేతలు చెప్తున్నారు. మరో రెండు నియోజకవర్గాల అభిప్రాయ సేకరణ గురువారంతో పూర్తికానుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ అభిప్రాయ సేకరణ ప్రకారం ఏ ఎంపీ స్థానంలో, ఎవరెవరి పేర్లను పార్టీ నేతలు చెప్తున్నారనే వివరాలన్నింటిని ఓ నివేదిక రూపంలో సిద్ధం చేసి రాష్ట్ర పార్టీకి అందజేయనున్నారు. రెండు రోజుల్లో ఈ నివేదిక రెడీ కాగానే, దాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించనున్నట్లు పార్టీ నేతలంటున్నారు. 

వివిధ మార్గాల్లో ఎంపిక ప్రక్రియ

రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు నుంచి ఐదు మార్గాల్లో కొనసాగుతోందని, అందులో ఇది ఒక  భాగం మాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీ ప్రత్యేక టీంలతో సర్వేలు చేయించిందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన టీంలతో మరో సర్వే చేయించారని, రాష్ట్ర పార్టీ కూడా వేరుగా సర్వే నిర్వహించిందని, ఇటీవల రాష్ట్ర పార్టీ కీలక నేతల నుంచి కూడా జాతీయ నేతలు అభ్యర్థుల ఎంపికపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సంఘ్ నేతలతో సమావేశమైన సందర్భంలో కూడా అభ్యర్థుల ఎంపికపై ఆర్ఎస్ఎస్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇలా బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు ఇలా వేర్వురు మార్గాల్లో ఇన్ని రకాలుగా సర్వేలు చేపడుతున్నది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఫైనల్​గా అభ్యర్థుల ఎంపిక జరగనుంది.