ఇయ్యాల అమిత్ షాతో బీజేపీ లీడర్ల భేటీ

ఇయ్యాల అమిత్ షాతో బీజేపీ లీడర్ల భేటీ
  • టీఆర్ఎస్‌‌పై పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్న కేంద్ర మంత్రి
  • ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై సూచనలు
  • హుజూరాబాద్ గెలుపుపై నేతలను అభినందించనున్న షా

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాతో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు మంగళవారం భేటీ కానున్నారు. ఢిల్లీలో జరిగే ఈ ప్రత్యేక సమావేశంలో..రాష్ట్రంలో టీఆర్ఎస్‌‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్​రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 
పాల్గొననున్నారు.
ముఖ్య నేతలకు ఫోన్లు
సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర హోం శాఖ కార్యాలయం నుంచి సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్య నేతలకు ఫోన్లు వెళ్లాయి. దీంతో చాలా మంది నేతలు సోమవారమే ఢిల్లీ చేరుకోగా, మరికొందరు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు. టీఆర్ఎస్‌‌పై బీజేపీ అనుసరించాల్సిన వైఖరిని ఈ సమావేశంలో అమిత్ షా స్పష్టం చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్‌‌‌‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై సూచనలు చేస్తారని అంటున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బద్నాం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నాయకులతో చర్చించనున్నారు. టీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ఎలాంటి పోరాటాలు చేయాలి, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కొనేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై చర్చించనున్నట్లు రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
హుజూరాబాద్ గెలుపు తర్వాత తొలిసారి
హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు తర్వాత తొలిసారి రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ అవుతున్నారు. ఈటల కూడా ఇప్పటిదాకా ఢిల్లీ పెద్దలను  కలవలేదు. మంగళవారం జరిగే మీటింగ్‌‌లో ఈటలను అమిత్ షా అభినందించి సన్మానించనున్నారు.