సీఏఏపై చర్చకు సిద్ధమా?..తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదు

సీఏఏపై చర్చకు సిద్ధమా?..తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదు

హైదరాబాద్, వెలుగు: సీఏఏలో  వివక్ష ఉందంటున్న కేసీఆర్, కేటీఆర్​.. దీనిపై చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సవాల్​ విసిరారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్​ తీర్మానం చేయడం ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాజ్యాంగ విరుద్ధమంటూ అంబేద్కర్ ను సీఎం కేసీఆర్​ అవమానపరిచారని మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకుంటున్న కేసీఆర్.. రాజ్యాంగం చదువలేదా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎవరి పరిధి ఏందో స్పష్టంగా ఉందన్నారు. ‘‘తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదు. ప్రత్యేకంగా ఆయనకు రాజ్యాంగం లేదు. సీఏఏను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే” అని స్పష్టం చేశారు. సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని టీఆర్​ఎస్​, ఎంఐఎం, కాంగ్రెస్​ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ఆఫీస్​లో జరిగిన ఓబీసీ మోర్చా ఇంటలెక్చువల్​ ఫోరం సమావేశంలో లక్ష్మణ్​ మాట్లాడారు. పార్లమెంట్​లో ఆమోదం పొందిన బిల్లుకు కొన్ని పార్టీలు మతం రంగు పులుముతున్నాయని మండిపడ్డారు. సీఏఏను అడ్డుపెట్టుకొని అల్లర్లు సృష్టిస్తున్నారని, ఢిల్లీలో మరణకాండ చేపట్టారని, దీని వెనుక అదృశ్యశక్తులు ఉన్నాయన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనకు ప్రధాన సూత్రధారులు ఎంఐఎం సోదరులని ఆరోపించారు. దేశంలో ఏ ఒక్కరికీ సీఏఏ వ్యతిరేకం కాదని, దీనివల్ల ఎవరికీ నష్టం కలుగదని చెప్పారు.

జిన్నా పాత్రలో ఒవైసీ

పాకిస్థాన్​ ముస్లింలకు ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటున్నారని, జిన్నా పాత్రను ఒవైసీ పోషిస్తున్నారని లక్ష్మణ్​ దుయ్యబట్టారు. ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారని, ఇందుకు టీఆర్ ఎస్​ వత్తాసు పలుకుతోందన్నారు. ‘‘టీఆర్​ఎస్ ఎమ్మెల్యే గాంధీ రాష్ట్రం ధర్మశాల, సత్రం అని అంటున్నారు. అయితే.. పాకిస్థాన్​ వాళ్లకు పౌరసత్వం ఇస్తామని, ఇదే తమ విధానం అని టీఆర్ ఎస్  చెప్పాలి” అని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. ‘‘ఎంఐఎంకు సిగ్గు లేదు. రచయిత్రి తస్లిమా హైదరాబాద్ కు వస్తే చెప్పులు వేయించిన చరిత్ర ఎంఐఎంది” అని అన్నారు. టీఆర్ ఎస్ ముసుగులో ఎంఎంఐం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని, ఎంఐఎం రజాకార్ల పాత్ర పోషిస్తుండగా, 8వ నిజాంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 129 మంది రోహింగ్యాలకు హైదరాబాద్‌లో​ ఆధార్ కార్డులు ఎందుకు ఇచ్చారని అందరూ ప్రశ్నిస్తుంటే.. ఒవైసీ అడ్డుకుంటున్నారని  మండిపడ్డారు. ప్రతి అంశంపై స్పందించే ట్విట్టర్​ పిట్ట కేటీఆర్​.. ఎంఐఎం నేత వారీస్ పఠాన్  చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లౌకికవాదం గురించి మాట్లాడే అర్హత టీఆర్ ఎస్ కు లేదన్నారు. ఓబీసీ మోర్చా ప్రజల్లోకి వెళ్లాలని, సీఏఏపై వాస్తవాలు చెప్పాలని సూచించారు.