- రూ.2,543 కోట్లు కేటాయింపు
- రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో కీలకమని, ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించా మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల కోసం రూ.2,543 కోట్లు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో ఆయన తెలిపారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సూక్ష్మ, చిన్న పరిశ్రమలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర నిధులతో పాటు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సమీకరిస్తామని పేర్కొన్నారు. పీఎం మిత్ర నిధులను వినియోగించుకుని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు లెదర్ పార్కులను కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం నలుమూలలా పరిశ్రమలు ఉండేలా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల అభివృద్ధి, ఉపాధి ఫలితాలు అందరికీ అందుతాయన్నారు. ప్రజల నివాసాలకు దూరంగా ఎలాంటి కాలుష్యం లేని రీతిలో వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
డ్రైపోర్టుల కోసం ప్రణాళికలు
రాష్ట్రానికి తీర ప్రాంతం లేనందున సరుకుల రవాణా కోసం డ్రైపోర్టులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పోర్టుల ద్వారా సరుకుల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
