6న అసెంబ్లీలో, మండలిలో బడ్జెట్‌‌‌‌

6న అసెంబ్లీలో, మండలిలో బడ్జెట్‌‌‌‌
  • బీఏసీ మీటింగ్‌‌‌‌లో తేల్చి చెప్పిన సర్కారు
  • బడ్జెట్‌‌‌‌ను స్టడీ చేసేందుకు 7న సభకు సెలవు
  • ఆ తర్వాత మూడు, నాలుగు రోజులు పద్దులపై చర్చ
  • చివరి రోజు అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం 

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ పద్దులు, అప్రాప్రియేషన్ బిల్లు పాసైన తర్వాతే మిగతా అంశాలపై చర్చించే అంశాన్ని పరిశీలిద్దామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. శుక్రవారం అసెంబ్లీ, కౌన్సిల్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో బీఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కనీసం 18 రోజులైన బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. పద్దులతో పాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సభలో చర్చించి, వాటికి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి జోక్యం చేసుకుని బడ్జెట్‌‌‌‌పై జనరల్ డిస్కషన్, పద్దులపై చర్చ, అప్రాప్రియేషన్ బిల్లుపై చర్చించి వాటిని పాస్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇస్తే, వాటిపై చర్చించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బీఏసీ సమావేశానికి హాజరుకాని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. బడ్జెట్ సెషన్ కనీసం 20 రోజులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌, ఓల్డ్‌‌‌‌ సిటీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌‌‌‌, వక్ఫ్‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌ పరిరక్షణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు, ఉర్దూ సెకండ్ ఆఫీషియల్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ అమలు, రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ పరీక్షల్లో ఉర్దూను చేర్చాలని కోరారు. కొత్తగా ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌ టవర్స్‌‌‌‌ నిర్మించాలని తదితర 25 అంశాలపై అసెంబ్లీలో షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌కు అనుమతించాలని అక్బరుద్దీన్‌‌‌‌ తన లేఖలో పేర్కొన్నారు. 

నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు..

గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ శనివారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్‌‌‌‌లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అధికార పార్టీ సభ్యుల ప్రసంగంతో చర్చ ప్రారంభించి ప్రభుత్వ సమాధానంతో ముగిస్తారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ సీఎం ఏదైనా కారణాలతో అసెంబ్లీకి హాజరుకాని పక్షంలో మంత్రి కేటీఆర్ సమాధానమిస్తారని పేర్కొన్నాయి. 5న ఆదివారం సభకు సెలవు ప్రకటించారు. 6న ఉదయం 10.30కు అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు, కౌన్సిల్‌‌‌‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి 2023–‌‌‌‌-‌‌‌‌24 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఏడో తేదీన బడ్జెట్ స్టడీ చేయడానికి సభకు సెలవు ఇవ్వనున్నారు. 8న బడ్జెట్‌‌‌‌పై జనరల్ డిస్కషన్ నిర్వహిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ రోజు ఏయే పద్దులపై చర్చిస్తారనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 9వ తేదీ నుంచి మూడు, నాలుగు రోజులు పద్దులపై చర్చించే చాన్స్‌‌‌‌ ఉంది. ఆ తర్వాతి రోజు అప్రాప్రియేషన్ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

మండలిలో 8న బడ్జెట్‌‌‌‌పై చర్చ

అసెంబ్లీ బీఏసీ అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ బీఏసీ సమావేశం నిర్వహించారు. మండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తారు. 6న బడ్జెట్ ప్రవేశపెడతారు. 8న బడ్జెట్‌‌‌‌పై సాధారణ చర్చ ఉంటుంది. తర్వాత మూడు, నాలుగు రోజులు మండలికి సెలవులు ఇస్తారు. చివరి రోజు అప్రాప్రియేషన్​ బిల్లుకు ఆమోదం తెలిపి, తర్వాత కౌన్సిల్‌‌‌‌ నిరవధికంగా వాయిదా పడనుంది. మండలి బీఏసీ మీటింగ్‌‌‌‌లో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.

ఇయ్యాల ప్రశ్నోత్తరాలు రద్దు

అసెంబ్లీ, మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నందున శనివారం ఉభయ సభల్లో క్వశ్చన్ అవర్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే 6వ తేదీ కూడా ప్రశ్నోత్తరాలు ఉండవని తెలిపారు. దీనిపై ఆదివారం బులెటిన్​ జారీ చేసే అవకాశం ఉంది.