అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే .. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్‌ల ఇష్టారాజ్యం

అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే .. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్‌ల ఇష్టారాజ్యం
  • తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య శాఖలు
  • గత సర్కార్ హయాంలో చక్రం తిప్పినోళ్లకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు
  • ప్రధాన ప్రతిపక్షానికి లీక్‌లు అనే ఆరోపణలు
  • కంచగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కార్
  • తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు
  • ఇదే అదనుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఓ నలుగురు సీనియర్ ఐఏఎస్‌ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ​హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కార్ పెద్దలతో అంటకాగిన వారినే.. ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఈ ఉన్నతాధికారులు.. తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తూ తమ కింది  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిందానికల్లా జీ హుజూర్​ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం,  ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది. 

ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్​అధికారులు.. ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులనే టార్గెట్​చేసుకొని వేధిస్తున్నారనే టాక్​సెక్రటేరియెట్​వర్గాల్లో నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్​ హయాంలో బిహార్, యూపీ​ ఐఏఎస్‌లు పాలనా వ్యవహారాల్లో అన్నీ తామై చక్రం తిప్పగా.. తెలంగాణ ఐఏఎస్​, ఐపీఎస్‌లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు ప్రాధాన్య పోస్టులు దక్కినా.. క్రమంగా అవమానాలు, ఆకస్మాత్తు బదిలీలు, అప్రాధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్​ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నట్లు తెలిసింది.  ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురి వ్యవహారం ఆయన ​చెవిన వేసినట్టు తెలుస్తోంది. 

ప్రతిపక్షానికి లీకులు.. అయినా చర్యల్లేవ్..

ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం పరిపాటి. కానీ రేవంత్​సర్కార్ ఆ పని చేయలేదు. గత ప్రభుత్వంలో ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్​తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన అధికారులనే కొనసాగిస్తూ వచ్చింది. ఒకట్రెండు శాఖలు మారినా ఆ అధికారుల మధ్యే ఉండడంతో ఈ​ ప్రభుత్వంలోనూ వారి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు.  ఆయా శాఖల పరిధిలో కీలక సమాచారం లీకవుతోందని, కాన్ఫిడెన్షియల్​విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చేరుతున్నాయనే ఆరోపణలు వచ్చినా.. కాంగ్రెస్​పెద్దలు పట్టించుకోలేదు. 

ఈ క్రమంలో కాళేశ్వరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల​రిపోర్టులు, బడ్జెట్ కేటాయింపు అంశాలు, రాష్ట్ర అప్పులు, వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ, టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ లాంటివన్నీ ముందే లీక్​కావడంతో ప్రతిపక్షం ఎప్పటికప్పుడు అలర్ట్​అవుతూ వచ్చిందనే వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఈ లీకు ఆఫీసర్ల వల్లే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఇరుకున పడిందనే వార్తలు వచ్చాయి. 

ఈ నలుగురితో పాటు ఓ మహిళా ఐఏఎస్​ఆఫీసర్ తీరు కూడా తీవ్ర వివాదాస్పదమైంది. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక చాలాకాలం లూప్‌‌లైన్‌‌లో ఉన్న ఆమెను సీఎం రేవంత్​పిలిచి మరీ పర్యాటక శాఖలోకి తీసుకొని మిస్​వరల్డ్​పోటీల నిర్వహణ లాంటి కీలక బాధ్యతలను అప్పగించారు. అక్కడ ఆమె అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారని, ఇతర అధికారులతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా ఖాతరు చేయలేదనే విమర్శలు వినిపించాయి. ఈలోగా కంచగచ్చిబౌలి వ్యవహారంలో ఎక్స్​ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంతో నష్ట నివారణగా ప్రభుత్వం ఆమెను తిరిగి లూప్‌‌లైన్‌‌లోకి పంపించింది. 

కానీ మిగిలిన నలుగురు సీనియర్​ఐఏఎస్‌‌లను మాత్రం కీలక పోస్టుల్లో ఏండ్ల తరబడి కొనసాగిస్తుండడంతో వారు తమ శాఖల పరిధి దాటి అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాళ్లను కొనసాగించడం తప్పని తెలిసినా గత్యంతరం లేక కంటిన్యూ చేస్తున్నామని ఇటీవల సీఎం స్వయంగా విలేకరులకు చెప్పడం గమనార్హం. ఓ మంత్రి కూడా ఇలాగే విలేకరులతో తన ఆవేదన వెల్లగక్కారు. కీలక సమావేశాల్లో తాము అధికారులతో చర్చిస్తున్న విషయాలు గేటు దాటే లోపలే ప్రధాన ప్రతిపక్షానికి చేరుతున్నాయని వాపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కీలక శాఖలన్నీ వారి గుప్పిట్లోనే..

గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరుగాంచిన ఒక మంత్రి శాఖను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే శాఖలో కొనసాగిస్తున్నారు. గత సర్కారు పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కొనసాగించడమే కాకుండా.. ఇటీవల జరిగిన బదిలీల్లో సీఎంవోకు తీసుకురావడం విశేషం. అక్కడ కూడా అదే శాఖకు సంబంధించిన ఒక కీలక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆయనను హెడ్‌‌గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​ కూడా గత ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహించగా, భూముల వ్యవహారాల్లో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 

ఇటీవల జరిగిన బదిలీల్లో ఆ అధికారి శాఖ మారుతుందని భావించినా ఆయనను కదలించకపోవడం గమనార్హం. దీంతో ఆ అధికారి ఎప్పట్లాగే పాత శాఖను చూస్తున్నారు. గత్యంతరం లేకే కొనసాగించాల్సి వస్తోందని, ఇలాంటి అధికారులను బదిలీ చేస్తే ఇబ్బంది అవుతుందని స్వయంగా సీఎం చెప్పారంటే ఆ సీనియర్​ఐఏఎస్‌‌ల కోటరీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేశారు. కీలక శాఖలను నిర్వహించిన ఆయనకు, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కలిగిన పోస్టులే దక్కుతున్నాయి. ఒక్క ఫైనాన్స్ శాఖ మాత్రమే కాకుండా నాలుగైదు శాఖల అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించడం గమనార్హం. 

తాజాగా ఒక ముఖ్యమైన శాఖకు హెచ్‌‌ఓడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడం ప్రభుత్వంలో ఆయనకు ఉన్న ప్రాబల్యాన్ని తెలియజేస్తోంది. మరో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న ఆయనకు కూడా ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం దక్కింది. సలహాదారుడిగా ఉండి ఇప్పుడు ఏకంగా సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా పోస్టింగ్ పొంది వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈయన అన్ని శాఖల్లోనూ తలదూరుస్తారని, తెలంగాణ ఐఏఎస్‌‌ల పట్ల వివక్ష చూపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చూసిన ముఖ్యమైన శాఖలను ఇప్పుడు సీఎంవోలోనూ ఆయనకే అప్పగించడం విశేషం.  

తెలంగాణ అధికారులకు ప్రయారిటీ దక్కట్లే..

కాంగ్రెస్​ సర్కార్ సైతం అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర రాష్ట్రాల ఐఏఎస్​ అధికారులకే పెద్దపీట వేస్తుండడంతో తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య పోస్టులే దక్కుతున్నాయనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో కొందరు తెలంగాణ​ఐఏఎస్‌‌లకు మంచి పోస్టింగ్‌‌లు ఇచ్చారు. వారు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెడ్తూ వచ్చారు. ఏమైందో ఏమో క్రమంగా ఒక్కొక్కరిని మారుస్తూ పోతున్నారు. ఉదాహరణకు సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. ఆయనకు మరో ఐదేండ్లకు పైగా సర్వీస్ ఉండగానే టీజీపీఎస్సీ చైర్మన్‌‌గా పంపడం చర్చనీయాంశమైంది. 

గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, ప్రభుత్వం వచ్చాక ఎంఏయూడీ ప్రిన్సిపల్ ​సెక్రటరీగా కొనసాగిన మరో సీనియర్ ​ఐఏఎస్ అధికారిని కార్మిక శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీగా బదిలీ చేయడం గమనార్హం. కీలకమైన మిస్​వరల్డ్​ పోటీలు జరుగుతున్న తరుణంలో ఆ బాధ్యతలు చూస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్​ అధికారిని కారణం లేకుండా పక్కనపెట్టి,  ఓ జూనియర్‌‌‌‌కు బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యపరిచింది. 

అదే విధంగా తెలంగాణకే చెందిన ఒక ఐఏఎస్ అధికారికి తొలుత ఎక్సైజ్ శాఖ కమిషనర్‌‌గా పోస్టింగ్ ఇచ్చి, ఆ తర్వాత ప్రాధాన్యం లేని మరో పోస్టుకు బదిలీ చేయడం కూడా ఇలాంటిదే! 2011 బ్యాచ్‌‌కు చెందిన తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్​ అడిషనల్ కమిషనర్‌‌ హోదాలోనే కొనసాగుతుండగా, ఆమె కంటే ఒక సంవత్సరం జూనియర్​ అయిన తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారికి కమిషనర్ పదవి ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వంలోనూ ఇలాగే బిహార్, యూపీకి చెందిన అధికారులకు ప్రాధాన్య పోస్టులు దక్కగా, ఇప్పుడు వారికి  తమిళనాడు వారు తోడయ్యారని, తెలంగాణ వారికి అప్పుడు ఇప్పుడు ప్రయారిటీ దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.