పాట తొలగించండి.. లేదంటే రూ.100 కోట్ల దావా వేస్తాం: డీడీ నెక్స్ట్ లెవల్ మూవీ మేకర్స్‎కు భాను ప్రకాష్ లీగల్ నోటీస్

పాట తొలగించండి.. లేదంటే రూ.100 కోట్ల దావా వేస్తాం: డీడీ నెక్స్ట్ లెవల్ మూవీ మేకర్స్‎కు భాను ప్రకాష్ లీగల్ నోటీస్

అమరావతి: డీడీ నెక్స్ట్ లెవల్ మూవీ మేకర్స్‎కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు జి. భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ పాటను రూపొందించారని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం (మే 14) ఓ వీడియో రిలీజ్ చేశారు. 

పవిత్రమైన గోవిందనామాన్ని పాటలో ఇష్టానుసారం ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిహారిక ఎంటర్టైన్మెంట్‎కు నోటీసు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా చూసుకోవడానికి నిర్మాణ సంస్థపై రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసు కూడా దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. తక్షణమే ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 

కాగా, కోలీవుడ్ యాక్టర్ సంతానం హీరోగా డైరెక్టర్ ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్. హారర్ కామెడీ  జోనర్‎లో రూపొందిన ఈ సినిమా 2025 మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్, సాంగ్స్ విడుదల చేశారు. అయితే.. ఈ సినిమాలోని ‘కిస్సా 47’ పాట వివాదస్పదమైంది. ఇందుకు కారణం పాటలో వాడిన లిరిక్స్. 

ఈ సాంగ్‎లో ఉపయోగించిన గోవింద గోవింద అనే పదాలు హిందువుల ఆస్తిక భావాలకు, తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉన్నాయని శ్రీవారి భక్తులు, హిందు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గోవింద గోవింద అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుమల ఆలయాన్ని, హిందువుల ఆరాధనా సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశ్యంతో వాడారని మండిపడుతున్నారు. వెంటనే ఈ పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సినిమాను విడుదల కానివ్వమని హెచ్చరించారు.