ఇవాళే తెలంగాణ బడ్జెట్

ఇవాళే తెలంగాణ బడ్జెట్
  •     మధ్యాహ్నం 12కు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
  •     మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు  
  •     రూ.2.95 లక్షల కోట్లతో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాలానికి గాను ఓటాన్​అకౌంట్​బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్–2024–25ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ. 2.95 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లలోపు అంచనాలతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. ప్రధానంగా ఆరు గ్యారంటీలకు రూ.70 వేల కోట్లు కేటాయించేలా అంచనాలు రెడీ చేశారు. మొత్తం మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను పెట్టనున్నారు. ఆరు గ్యారంటీలతో పాటు ఉద్యోగుల జీత భత్యాలు, అభయ హస్తంలోని ముఖ్యమైన స్కీముల అమలుకు బడ్జెట్​లో కేటాయింపులు చేశారు. రైతు భరోసాతో సహా వ్యవసాయ రంగానికి రూ. 30 వేల కోట్లు, ఇండ్లకు, వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ కోసం రూ. 20 వేల కోట్లు, చేయూత కింద పెన్షన్లు ఇచ్చే పంచాయతీ రాజ్ కు రూ. 30 వేల కోట్లు, ఇందిరమ్మ హౌసింగ్ కు రూ.15 వేల కోట్ల మేర ప్రతిపాదించినట్లు తెలిసింది. అసలు రాష్ట్ర సొంత ఆదాయం ఎంత ? కేంద్రం నుంచి వస్తున్నది ఎంత ? ఇతర ఆదాయ మార్గాలు ఏమున్నాయి ? అప్పుల ద్వారా ఎంత సమకూరుతుందనే వివరాలతో పాటు ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుంది? ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయింపులతో పాటు రుణమాఫీకి నిధుల సర్దుబాటు వంటి వాటిపై కొత్త సర్కార్ ఫోకస్ పెట్టింది. గత సర్కార్ లెక్కల్లో మతలబు చేసి అంకెల గారడీతో బడ్జెట్​ను తీసుకువచ్చిందని.. వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. అందుకే వాస్తవ ఆదాయం ఎంత వస్తుందనే పక్కా అంచనాతో ఈ సారి బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు సమాచారం. 
 
కేంద్రం గ్రాంట్లలో కోతతో తగ్గనున్న బడ్జెట్?  

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో ఏటా10 శాతం నుంచి 12 శాతం బడ్జెట్​ను పెంచుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్​ను అప్పటి ప్రభుత్వం పెట్టింది. అయితే, ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ ను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 2023–24లో రూ.43,294 కోట్లు వస్తుందని గత ప్రభుత్వం పేర్కొన్నది. కానీ అది డిసెంబర్ నాటికి రూ.5 వేల కోట్ల వరకే వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఈ మొత్తం ఇంకో  రూ.2 వేల కోట్ల నుంచి 3 వేల కోట్ల వరకే వస్తుంది. దీంతో రూ.35 వేల కోట్ల మేర బడ్జెట్​లో కోత పడుతుంది. అందుకే బడ్జెట్ లో ఈ కేటాయింపులు తగ్గించుకోవాలని సర్కార్ భావిస్తున్నది. 

ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ విషయంలోనూ ప్రభుత్వం అదనపు ఆదాయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లనుంది. ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లు, అప్పులకు కిస్తీలు, వడ్డీలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయనున్నారు. జీఎస్డీపీలో 3 శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి. ట్యాక్స్ రెవెన్యూ రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్ల మేరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. నాన్​ట్యాక్స్ రెవెన్యూ కూడా రూ.20 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రతిపాదనలు చేశారు. అలాగే అప్పులు రూ.50 వేల కోట్ల వరకు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇతరత్రా కలిపితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మొత్తం రూ.2.95 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.