గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం,అజారుద్దీన్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం,అజారుద్దీన్
  • రాష్ట్ర కేబినెట్ నిర్ణయం కోదండరాం, అమేర్ అలీఖాన్‌‌ సభ్యత్వాలను కోర్టు రద్దు చేయడంతో ఎంపిక  
  • కోదండరాంకు మళ్లీ చాన్స్.. అనూహ్యంగా అజారుద్దీన్‌‌ తెరపైకి ఆయనకు మైనార్టీ, 
  • హైదరాబాద్ జిల్లా కోటాలో మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం
  • జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ బీసీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు 
  • అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు:గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌‌ను ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే కోటాలో ఏడాది కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమేర్ అలీఖాన్ సభ్యత్వాలను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. తిరిగి కొత్త పేర్లను సిఫార్సు చేయవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన మీటింగ్‌‌లో కోదండరాం, అజారుద్దీన్‌‌ను ఎంపిక చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోదండరాంకు మళ్లీ అవకాశం కల్పించగా, అమేర్ అలీఖాన్ స్థానంలో అనూహ్యంగా అజారుద్దీన్‌‌ను ఎంపిక చేసింది.

2024 ఆగస్టులో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్ నియమితులయ్యారు. సరిగ్గా ఏడాది పాటు పదవిలో కొనసాగారు. ఇప్పుడు కోదండరాం తిరిగి నియమితులు కానుండడంతో ఆయన మరో ఆరేండ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. బీఆర్ఎస్​ సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల కోదండరాంకు ఏడాది పదవీకాలం బోనస్‌గా వచ్చినట్లయింది. కాగా, ఏడాది కింద ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్‌ను గవర్నర్​నియమించడాన్ని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

తాము అధికారంలో ఉన్నప్పుడు పంపిన లిస్టును పక్కన పెట్టిన గవర్నర్.. కాంగ్రెస్​సర్కార్ పంపిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు.. కోదండరాం, అమేర్ అలీఖాన్‌ సభ్యత్వాలను ఇటీవల రద్దు చేసింది. అదే సమయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం తిరిగి కొత్త పేర్లను గవర్నర్​కోటాకు సిఫార్సు చేయవచ్చని స్పష్టం చేసింది. 

మంత్రి పదవి ఇచ్చేందుకే ఎమ్మెల్సీగా ఎంపిక! 

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఆసక్తి చూపారు. టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా చేశారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. ఒక దశలో కాంగ్రెస్ టికెట్ ఆయనకే దక్కుతుందనే ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీలకు, హైదరాబాద్ జిల్లా నుంచి ఒక్కరికీ ప్రాతినిధ్యం లేకపోవడం అజారుద్దీన్ కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకే ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి అజారుద్దీన్‌కు ఖాయమైనట్లేననే ప్రచారం జరుగుతున్నది. 

జూబ్లీహిల్స్​ బరిలో బీసీ అభ్యర్థి..

స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఇంటాబయట పోరాడుతున్న కాంగ్రెస్..  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీకే టికెట్​ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే ఇక్కడ టికెట్ రేసులో ఉన్న అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. దీంతో బీసీ అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. అయితే బీసీ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి 2014లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి.. అప్పటి నుంచి నియోజకవర్గంలో చురుగ్గా పని చేస్తున్నారు. జూబ్లీహిల్స్​టికెట్ కోసం కొంతకాలంగా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

అలాగే మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో రెండుసార్లు కార్పొరేటర్‌‌గా పనిచేయడం, ప్రస్తుతం తన కొడుకు కార్పొరేటర్‌‌గా ఉండడంతో టికెట్‌పై ఆయన ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు పీజేఆర్ శిష్యుడు, విద్యాసంస్థల యజమాని భవానీ శంకర్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకు టికెట్ ఇవ్వాలని ఇటు పీసీసీ, అటు ఏఐసీసీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్​టికెట్ దక్కించుకునే బీసీ నేత ఎవరనే ఉత్కంఠ నెలకొన్నది.