మూడు ఖాళీలు..  ఎవరికి చాన్స్..సెప్టెంబర్ 7లోపే మంత్రివర్గ విస్తరణ.!

మూడు  ఖాళీలు..  ఎవరికి చాన్స్..సెప్టెంబర్ 7లోపే మంత్రివర్గ  విస్తరణ.!
  • గవర్నర్‌‌‌‌‌‌‌‌, రేవంత్ భేటీతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు
  • ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఆ లోపే విస్తరణ!

హైదరాబాద్, వెలుగు: కొండా సురేఖను బర్తరఫ్‌‌‌‌ చేయడంతో రాష్ట్ర కేబినెట్‌‌‌‌లో ఖాళీల సంఖ్య మూడుకు చేరింది. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఈ లోపే ఆ ఈ మూడు మంత్రి పదవులను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్‌‌‌‌కు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఆదివారం ఉండే చాన్స్​ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసన సభ్యుల సంఖ్య 117. ఇందులో మంత్రిపదవులు15శాతానికి మించరాదు.

అంటే కేబినెట్‌‌‌‌లో సీఎంతో కలిపి 18 మంది ఉండవచ్చు.

ఇప్పటివరకు 16 మంది మంత్రులు ఉండగా, కొండా సురేఖను తప్పించడంతో ఆ  సంఖ్య 15కు చేరింది. దీంతో త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో మరో ముగ్గురిని మంత్రులుగా తీసుకునే అవకాశముంది. మంత్రి సురేఖను బర్తరఫ్​చేసిన తర్వాత గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈమేరకు సురేఖను బర్తరఫ్ చేసేందుకు దారి తీసిన పరిస్థితులను ఆయనకు వివరించినట్లు తెలిసింది.

రేసులో ఉన్నదెవరు..

బీసీ మహిళ బెర్త్ ఖాళీ కావడంతో మళ్లీ మహిళతోనే ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినవస్తోంది. ఆమె హైకమాండ్ స్థాయిలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే అదే సామాజిక వర్గానికి చెందిన విప్ ఆది శ్రీనివాస్ పేరును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. పద్మశాలీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. దీంతో ఆ సామాజికవర్గం నుంచి సీనియర్లలో ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చి, నవంబర్ లో ఖాళీ కానున్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇక మిగిలిన రెండు ఖాళీల్లో ఒకటి రెడ్డి, మరొకటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి, సుదర్శన్‌‌‌‌రెడ్డి, మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి, ఎస్టీ కోటాలో రామచంద్రు నాయక్‌‌‌‌కు చాన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. కేబినెట్‌‌‌‌లోని మూడు బెర్త్‌‌‌‌లలో ప్రస్తుతం రెండు మాత్రమే భర్తీ చేసి ఒకటి ఖాళీగా ఉంచుతారన్న వాదన కూడా వినిపిస్తున్నది.  అలా చేస్తే ఆ రెండింటికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్లను సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లు పీసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్​కు మంత్రి పదవి దక్కే చాన్స్​ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సామాజికవర్గం నుంచి మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్​కుమార్‌‌‌‌‌‌‌‌ను తప్పించి ఆ స్థానంలో గడ్డం ప్రసాద్ ను తీసుకుంటారని, బదులుగా అడ్లూరికి స్పీకర్​ పదవి ఇస్తారని సమాచారం.