చుక్క నీరు కూడా వదులుకోం.. బనకచర్లను చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకుంటం: కేబినెట్ తీర్మానం

చుక్క నీరు కూడా వదులుకోం.. బనకచర్లను చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకుంటం: కేబినెట్ తీర్మానం
  • తీర్మానించిన రాష్ట్ర కేబినెట్​
  • కాళేశ్వరం కమిషన్​కు ప్రభుత్వం దగ్గరున్న ఆధారాలు ఈ నెల 30లోగా అందజేత
  • ట్రిపుల్​ ఆర్​ దక్షిణ భాగం 201 కిలో మీటర్ల అలైన్​మెంట్​కు ఓకే
  • అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు
  • తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్​ రూపకల్పనకు, స్పోర్ట్స్​ పాలసీకి ఆమోదం
  • విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై హైలెవెల్​ కమిటీలో చర్చించాలని నిర్ణయం 
  • క్యాన్సర్​ కట్టడికి ప్రత్యేక కార్యాచరణ.. సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ
  • హైకోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై ముందుకు..
  • కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై మూడు నెలలకోసారి ప్రత్యేక రివ్యూ
  • సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన ఆరు గంటల పాటు సాగిన కేబినెట్​ భేటీ
  • వివరాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టును చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర కేబినెట్  తీర్మానించింది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకించాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న పూర్తి వివరాలను ఈ నెల 30 లోగా జస్టిస్​ ఘోష్​ కమిషన్‌కు అందివ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీతో పాటు తెలంగాణ రైజింగ్ –2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు కేబినెట్​ ఓకే చెప్పింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీని ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.

విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, డిసెంబర్ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని ఆదేశించింది.  ప్రతినెలా రెండుసార్లు జరిగే కేబినెట్​ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై  ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక  రివ్యూ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్​లో దాదాపు ఆరుగంటల పాటు కేబినెట్​ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఆ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు. 

గోదావరి- బనకచర్లపై ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి జులై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని కేబినెట్​లో నిర్ణయించారు. ఇందులో బనకచర్లపై పూర్తి వివరాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.  ‘‘తెలంగాణ నీటి వాటాను ఏపీకి అప్పగిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం. గోదావరి జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నాం. చిత్తశుద్ధితో పనిచేయాలని నిర్ణయించాం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వ పాలనలోనే 2016లో కేంద్రం నిర్వహించిన అపెక్స్​ కమిటీ మీటింగ్​లో గోదావరి బేసిన్​లోని వాటర్​ను పెన్నా బేసిన్​లోకి పంపేందుకు అంగీకరించారని ఆయన తెలిపారు. అలాంటి బీఆర్​ఎస్​ నేతలు ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నీటి వాటా కోసం ఎంతదూరమైన వెళ్తామని, ఎంత పోరాటమైనా చేస్తామని తెలిపారు.  ‘‘నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో బనకచర్లకు ఫౌండేషన్​ జరిగితే ఇప్పుడు దాన్ని  కప్పిపుచ్చుకునేందుకు మసిపూసి మారేడుకాయ చేసేలా బీఆర్​ఎస్​ నేతలు వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారశైలిని కేబినెట్ తీవ్రంగా ఖండించింది. జులై ఫస్ట్​ వీక్​లో నిర్వహించే సమావేశంలో ఇదే అంశంపై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఉంటుంది. కేంద్రం వద్ద  కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపిస్తాం” అని ఆయన ప్రకటించారు. 

కాళేశ్వరం కమిషన్​కు 30న సమగ్ర రిపోర్ట్​
కాళేశ్వరంపై ఈ నెల 30లోపు కాళేశ్వరం కమిషన్‌‌కు పూర్తి వివరాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘కాళేశ్వరానికి గత ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం ఉందా? లేదా? వివరాలను కమిషన్​కు ఇవ్వాలని నిర్ణయించాం. కేబినెట్​ అప్రూవల్స్​ ఉన్నాయని నాటి సీఎం, నాటి మంత్రులు ఈటల లాంటి వాళ్లు చెప్పుకున్నారు. అసలు కాళేశ్వరం ఎక్కడ కట్టాల్సింది ఎక్కడ కట్టారో పూర్తి ఆధారాలతో, రిటైర్డ్​ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్​లు, కేబినెట్​ సబ్​ కమిటీ ఉద్దేశం ఏమిటి?  కేబినేట్​ సబ్​ కమిటీ నివేదిక కేబినెట్​లో అప్రూవ్​ చేసిన తర్వాత పనులలో ఇంప్లిమెంట్​ చేశారా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి వివరాలతో కమిషన్​కు ఇవ్వాలని నిర్ణయించాం” అని వివరించారు. 

రైజింగ్ డాక్యుమెంట్ ​పాలసీకి అడ్వయిజరీ కమిటీ 
తెలంగాణ రైజింగ్ –2047 విజన్ పాలసీ డాక్యుమెంట్​ను రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ వెల్లడించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్‌‌ను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. ఇందులో అన్ని శాఖలు, అన్ని విభాగాలు భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని.. ఆశించిన వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్‌‌లో పొందుపరుస్తారని వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి ఆయోగ్ తో పాటు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్  రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్ట్‌‌నర్‌‌గా వ్యవహరిస్తాయని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలన్న భారీ లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్​కు రూపకల్పన చేయాలని అధికారులకు కేబినెట్  దిశా నిర్దేశం చేసిందని ఆయన వెల్లడించారు. 

క్యాన్సర్​ కట్టడికి చర్యలు 
మహబూబ్​నగర్ ట్రిపుల్​ ఐటీలో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్స్​ మొదలుపెట్టనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. బాసర ట్రిపుల్​ ఐటీలో సంవత్సరానికి 180 మంది చొప్పున ఆరేండ్లకు 1,080 మందికి అడ్మిషన్స్​ తీసుకునేందుకు కేబినెట్​ ఆమోదం తెలిపిందన్నారు. శాతావాహన యూనివర్సిటీ కింద ఈసీఈ, కంప్యూటర్​ సైన్స్​, ఏఐ, ఐటీ వంటి నాలుగు కోర్సులకుగాను 60 సీట్ల చొప్పున 240 సీట్లకు కౌన్సెలింగ్​ చేపట్టాలని నిర్ణయించిందని వివరించారు. 60 చొప్పున ఎల్​ఎల్​బీ సీట్లకు కూడా కేబినెట్​ ఆమోదం తెలిపిందన్నారు. ఎంఎన్​జే క్యాన్సర్​ హాస్పిటల్​లో మరిన్ని వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత క్యానర్స్​ నిపుణులు డాక్టర్​ నోరి దత్తాత్రేయను ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవాలని నిర్ణయించామని, క్యాన్సర్​ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సలహాలు ఇస్తారని మంత్రి వివరించారు. పెరుగుతున్న క్యాన్సర్​ను కట్టడి చేసేందుకు ముందుకు వెళ్తామన్నారు.

కోర్టు తీర్పు ప్రకారం స్థానిక ఎన్నికలు
స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతున్నందున  దీనిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని కేబినెట్​లో చర్చించినట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు రిజర్వ్​ చేసినందున.. తీర్పు వెలువడిన దాని ప్రకారమే నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది. స్థానిక ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్​ను మీడియా ప్రశ్నించగా..  ‘‘ప్రస్తుతం హైకోర్టు లో కేసు ఉన్నది. కోర్టు తీర్పు ప్రకారమే ముందుకు వెళ్తాం” అని చెప్పారు. 

మూడునెలలకోసారి కేబినెట్​ ప్రత్యేక భేటీ
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో డిసెంబర్​ 9లోపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేబినెట్​లో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి మూడు నెలలకోసారి స్టేటస్ రిపోర్ట్ మీటింగ్  నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ మూడు నెలల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను ఈ ప్రత్యేక భేటీలో సమర్పించి చర్చిస్తారని తెలిపారు.  ఈ మూడు నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గంతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొంటారన్నారు. 

నేడు రైతు భరోసా సంబురాలు
మంగళవారంతో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుందని, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతుభరోసా కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియెట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు కేబినెట్‌‌ నిర్ణయించిందని తెలిపారు. ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నామ న్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ రైతు నేస్తం కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.  

క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు
స్పోర్ట్స్​పాలసీకి కేబినెట్​ఆమోదం తెలిపిందని స్పోర్ట్స్​ మినిస్టర్​ వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ పాలసీ రాష్ట్రంలోని క్రీడాకారులకు వరం అని చెప్పారు. ‘‘2036లో జరగనున్న ఒలింపిక్స్​లో మన సత్తా ఏంటో చూపించే విధంగా పాలసీ ఉంటుంది. ఇప్పుడు 8–10 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థుల్లో క్రీడాకారులను వెలికి తీస్తాం. 2036 నాటికి ఒలింపిక్స్ పతకాలు తెచ్చేలా వాళ్లను తీర్చిదిద్దుతాం. స్పోర్ట్స్​ హబ్​ బోర్డ్ ఆఫ్​ గవర్నెన్స్​ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పారితోషికాలు ఇస్తాం. జిల్లా కలెక్టర్ల సీబీ  ఫండ్​ నుంచి 10 శాతం స్పోర్ట్స్​కు వినియోగించేలా వెసులుబాటు కల్పించాం” అని వివరించారు. 

కొత్త మంత్రులకు స్వాగతం
ఇటీవలే మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న మైనింగ్​, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మొదటి సారిగా కేబినెట్​ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి  సీఎస్​ రామకృష్ణారావు బొకేలు అందజేసి ఆహ్వానం పలికారు. 

మరిన్ని నిర్ణయాలు
సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్​గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్ల నియామకానికి, వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కేబినెట్  ఓకే చెప్పింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్​మెంట్ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను ఈ సందర్భంగా  పరిశీలించింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలో మీటర్ల పొడవు ఉండే అలైన్​మెంట్​కు తుది ఆమోదం తెలిపింది.