- అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో కేబినెట్ నిర్ణయం
- ఈ నెలాఖరు నుంచి సవరించిన భూముల విలువలు అమల్లోకి
- యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు
- వరి, మక్కజొన్న పంటలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని నిర్ణయం
- 9 ఉమ్మడి జిల్లాల్లో సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లు
- నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు నల్గొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం
- క్యూర్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలకు ఓటీఎస్
- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
- మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై కమిషన్ రిపోర్ట్‌ను సీబీఐకి అప్పగించి, దర్యాప్తు కోరాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. పలు అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ వ్యవహారం ముడిపడి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గ సమావేశం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియెట్‌లో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఈ నెల చివరి వారం నుంచి సవరించిన విలువలు అమల్లోకి తేవాలని ఆదేశించింది. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా 10 శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయని, మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికీ మంత్రివర్గం ఓకే చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్‌లు, టీశాట్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా, మంత్రివర్గ సమావేశాల తీసుకున్నారు.
వరి, మక్క కొనుగోళ్లు వేగవంతం..
మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరి, మక్క కొనుగోళ్లు స్పీడప్ చేయాలని కేబినెట్నిర్ణయించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇబ్బంది లేకుండా రెండు పంటలను కొనాలని కేబినెట్ తీర్మానించినట్లు చెప్పారు. అకాల వర్షాలతో పంటలు తడవకుండా ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. గత సర్కారు హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లలో జరిగిన అక్రమాలపై తమ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. ‘2024 మార్చి 14 న రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జూలైలో ఆయన విచారణ నుంచి తప్పుకోగా, జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను కమిషన్‌గా నియమించాం. 2024 అక్టోబర్‌లో కమిషన్ 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం 2025 జనవరి 4న జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. వాటన్నింటినీ కేబినేట్ చర్చించింది. అందులో భాగంగానే సీబీఐకి కమిషన్ నివేదికను అప్పగించి, దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది.’ అని తెలిపారు. భూముల మార్కెట్ విలువలపైనా కేబినేట్లో చర్చించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు.. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారని, పరిహారం మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలకు, బయట మార్కెట్ లో ఉన్న వాస్తవ ధరలకు భారీ వ్యత్యాసం ఉందని, శాస్త్రీయపద్ధతిలో ఈ భూముల రేట్లను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల్లో ఉండే రివిజన్ కమిటీలు మార్కెట్విలువలను సవరిస్తాయన్నారు. ఈ నెలాఖరులో సవరించిన విలువలు అమల్లోకి వస్తాయని పొంగులేటి స్పష్టంచేశారు.
కేబినేట్లో మరిన్ని నిర్ణయాలు
నల్గొండ-– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు’కు అప్పగించే ఎంవోయూకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహిస్తుంది.
క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేసేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ( ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. రూ.5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది.
