- ఓఆర్‌ఆర్ లోపలి ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను మల్టీ యూజ్ జోన్స్‌గా మార్చే పాలసీకి ఓకే
- ‘అందెశ్రీ స్మృతివనం’ ఏర్పాటు.. ఆయన కుమారుడు దత్తసాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం..
- రెండేండ్ల పాలన సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
- డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్- 2047’ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
- ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్‌కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు
- రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వారం పది రోజుల్లో నోటిఫికేషన్
- పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు
- కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
- కేంద్రం సహకారం లేకనే బీసీ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్
- కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మరో వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం వద్ద, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం, మార్చి లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ. 3 వేల కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉన్నందున కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని మీడియాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాల కోసం డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు.
కాగా, 42 శాతం రిజర్వేషన్లపై కోర్టులో తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సెక్రటేరియెట్‌లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఈ భేటీలో స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, గిగ్ వర్కర్ల సంక్షేమ ముసాయిదా బిల్లు, అందెశ్రీ స్మృతివనం, రెండేండ్ల పాలన – ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-–2025 నిర్వహణ.. ఇలా మొత్తం 19 అంశాలపై చర్చించారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాకు వెల్లడించారు.
కేంద్ర సహకారం లేకనే ఆగిన బిల్లులు!
గ్రామాల్లో పాలన వ్యవస్థ దెబ్బతింటున్నందున వీలైనంత తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. చిత్తశుద్ధితో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసినా.. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనందున బిల్లులు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగుస్తుందని, అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయని చెప్పారు. అందుకే ఈ డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని వివరించారు.
ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించారు. గతంలో డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇచ్చిందని, దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైందన్నారు. అయితే, కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయిందని, ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025’ నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘‘డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించాం. రెండేండ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమిట్ వేదికగా డిసెంబర్ 8న ప్రజలకు వివరించే కార్యక్రమాలు ఉంటాయి” అని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ ను మల్టీ యూజ్ జోన్స్ గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ’ని కేబినెట్ ఆమోదించిందన్నారు.
ఎస్ఆర్ఎస్ పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కు మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రకటించారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (ఆర్డీఆర్) ఎస్ఆర్ఎస్ పీ స్టేజ్ 2 కెనాల్ అని పేరు మార్చనున్నట్లు వివరించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ‘తెలంగాణ ప్లాట్ ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్ –2025’ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని పొంగులేటి చెప్పారు.
అందెశ్రీ స్మృతివనం
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కుమారుడు ఎ. దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావి తరాలకు తెలియజేసేలా.. ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ‘అందెశ్రీ స్మృతి వనం’ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించినట్లు వివరించారు. మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబసభ్యుల్లో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
