గుడ్ న్యూస్: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

గుడ్ న్యూస్: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
  • ఆగస్టు 1న జరిగే కేబినెట్​లో విధివిధానాలు ప్రకటిస్తం 
  • అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: అర్హులందరికీ త్వరలోనే  కొత్త రేషన్ కార్డులిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు.  ఆదాయం, భూమి పరిమితిపై స్పష్టత ఇస్తామన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో 91.68 లక్షల రేషన్ కార్డులుంటే, ప్రస్తుతం 89.96 లక్షల కార్డులున్నాయి. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఖరీఫ్ పంటలో సన్నవడ్లను రూ.500 బోనస్ తో కొనుగోలు చేయబోతున్నాం.

రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న చనాక-కొరాట ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఈ ఏడాది ఇరిగేషన్ పై రూ.10,820 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మహాలక్ష్మీ స్కీము కింద ఎల్పీజీ కనెక్షన్ రన్నింగ్ లో ఉండి, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ  రూ.500 ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం 42.9 లక్షల బెనిఫిషర్స్ కు ఇస్తున్నాం. గత ప్రభుత్వం రూ.20వేల కోట్ల ధాన్యం అన్ సెక్యూరిటీగా మిల్లర్లకు ఇచ్చింది. కానీ, మా ప్రభుత్వం మాత్రం మిల్లర్ల దగ్గర 25శాతం బ్యాంక్ గ్యారంటీ అడగబోతున్నది.  సివిల్ సప్లై శాఖలో రిఫామ్స్ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.