- సోలార్ పవర్ సామర్థ్యాన్ని మరో 5 వేల మెగావాట్లకు పెంచే యోచన
- రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, కొత్త డిస్కం ఏర్పాటుపై డిస్కషన్..
- కీలక నిర్ణయాలు వెలువడే చాన్స్
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలే ప్రధాన అజెండాగా మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. సెక్రటేరియెట్‌లో జరగనున్న ఈ భేటీలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 5 వేల మెగావాట్లకు పెంచడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.దీంతోపాటు అండర్ గ్రౌండ్ కేబులింగ్, కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటు, రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, 2 వేల మెగావాట్ల పంప్ట్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు (పీఎస్‌పీ), 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ(బెస్) ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం(2026--–-27) ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరుతున్నాయి. కానీ ప్రస్తుతం విద్యుత్‌చార్జీల పెంపుపై నిర్ణయం ఉండకపోవచ్చని తెలుస్తున్నది . రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్కమ్‌లు ఉండగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ దీని పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనలున్నాయి. దీనిపైనా నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది.
కొత్త థర్మల్ప్లాంట్పై ముందుకా? వెనక్కా?
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రామగుండంలో ఎన్టీపీసీ సొంత పెట్టుబడితో తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న 2,400 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంటు నుంచి కేవలం 800 మెగావాట్లు కొనడానికి తెలంగాణ డిస్కంలకు గతంలోప్రభుత్వం అనుమతించింది. మరో 1600 మెగావాట్లు ఎన్టీపీసీ ఇచ్చే అవకాశమున్నప్పటికీ రాష్ట్ర సర్కారు మాత్రం సొంతంగా రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నది. ఇందుకోసం రూ.10,600 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇది అదనపు భారమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు థర్మల్ ప్లాంట్ల ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. గ్రీన్ ఎనర్జీ కారిడార్(జీఈసీ)లో భాగంగా 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో రాష్ట్రానికి10 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. ప్రస్తుతం యూనిట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ.2 నుంచి 3 వరకు ఖర్చువుతుండగా.. అదే థర్మల్ పవర్ విద్యుత్ ఉత్పత్తికి రూ.6 నుంచి రూ. 7 ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ క్రమంలో యాదాద్రిలో ఒక్కోటి 800 కెపాసిటీ ఉన్న మూడు థర్మల్ ప్లాంట్లు ఇంకా ఉత్పత్తి దశకు చేరకపోవడం, సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి పవర్ప్లాంట్లు సర్కారుకు భారంగా పరిణమించిన నేపథ్యంలో రామగుండంలో తలపెట్టిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్‌పై రాష్ట్ర సర్కారు ముందుకెళ్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సోలార్ ఎనర్జీపై స్పెషల్ ఫోకస్
2030 నాటికి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 24 వేల మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసింది. థర్మల్ విద్యుత్‌ప్లాంట్ల ఏర్పాటుతో తలెత్తే పెట్టుబడి, పర్యావరణ సమస్యలు, విద్యుత్ ఉత్పత్తి వ్యయం లాంటి కారణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీపై దృష్టిపెట్టింది. ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తుండడంతో రాష్ట్రంలో మరో 5వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఈ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,900 మెగావాట్ల సోలార్ పవర్ జనరేషన్ సామర్థ్యం ఉండగా 2030 నాటికి 19 వేల మెగావాట్లకు చేరుకునేలా ఆఫీసర్లు ఇప్పటికే ప్రపోజల్స్ రెడీ చేశారు. సెక్రటెరియేట్‌లాంటి ఖాళీ ప్రదేశాల్లో సోలార్ ప్యానెల్స్ అమర్చగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీటితోపాటు ప్రభుత్వానికి ఉన్న ఖాళీ జాగాల్లో, కెనాల్స్‌పై, వ్యవసాయ భూముల్లో సోలార్ ప్యానల్స్, రిజర్వాయర్లు, చెరువుల్లో ఫ్లోటింగ్ ప్యానెల్స్ పెట్టే విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశముంది.
