మిర్చి సాగుపై ధరల ఎఫెక్ట్! .. గతంతో పోలిస్తే 30 శాతం తగ్గిన పంట విస్తీర్ణం

మిర్చి సాగుపై ధరల ఎఫెక్ట్! .. గతంతో పోలిస్తే 30 శాతం తగ్గిన పంట విస్తీర్ణం
  • మిరప విత్తనాల విక్రయాలపైనా ప్రభావం
  • గతంలో కిలో రూ.35 వేల నుంచి లక్ష రూపాయలు
  • నేడు సగానికి పడిపోయిన ధరలు

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది రాష్ట్రంలో మిర్చి సాగు గణనీయంగా పడిపోతున్నది. మార్కెట్‌‌‌‌లో ధరలు తగ్గడం, గత సీజన్‌‌‌‌లో విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు మిర్చి సాగు చేయడం లేదు. గతంతో పోలిస్తే మిర్చి సాగు ఈ ఏడాది 30 శాతానికి పడిపోయిందని హార్టికల్చర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిర్చికి బదులు మొక్కజొన్న, పత్తి, ఆయిల్ పామ్ వంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో మిర్చి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. గతంలో మిర్చి క్వింటాల్ రూ.25 వేలకు పైగా ధర పలికేది. గత సీజన్‌‌‌‌లో ధరలు రూ.10 వేలకు పడిపోవడంతో పాటు చైనా, థాయ్​లాండ్ వంటి దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. 

నిరుడు పండించిన మిర్చి పంట.. ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలు, గోదాముల్లో నిల్వ ఉన్నది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. మల్టీనేషనల్ కంపెనీలు గతంలో రైతులతో బైబ్యాక్ ఒప్పందాలు కుదుర్చుకుని మిర్చి సాగును ప్రోత్సహించేవి. అయితే, ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు కూడా ఆసక్తి చూపడం లేవు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3లక్షల ఎకరాల్లో పండించే మిర్చి పంట.. ఇప్పుడు లక్ష ఎకరాలు కూడా సాగవ్వడం లేదు.

భారీగా తగ్గిన అమ్మకాలు

మిర్చి విత్తనాల అమ్మకాలు భారీగా తగ్గాయి. నిరుడు మిర్చి సీడ్స్ కిలో రూ.35 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలికేది. 10 గ్రాముల ప్యాకెట్​కు సామాన్య రకాలు రూ.350 నుంచి రూ.850 వరకు.. క్వాలిటీ రకాలు వైరస్​ ఫ్రీ అంటూ 10 గ్రాములు రూ.1,000 నుంచి రూ.1,300 వరకు విక్రయించారు. ఇతర రకాలను రూ.800 నుంచి రూ.900 చొప్పున అమ్మారు. ఇప్పుడు ధరలు సగానికి పడిపోయాయి. 10 గ్రాముల ప్యాకెట్ రూ.500 అన్న కొనేవారు లేరు. ఈ సారి కిలో ప్యాకెట్ రూ.25 వేల నుంచి రూ.55వేలకు మించడం లేదు. మిరప విత్తనాల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఖమ్మం, వరంగల్ వచ్చేవారు. డిమాండ్ ఉన్న అరుదైన రకాల మిరప విత్తనాలకు తెలంగాణ ప్రసిద్ధి. సాగుకు రైతులు ఆసక్తి చూపకపోవడంతో దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. 20 శాతం షాపుల్లోనే అమ్మకాలు జరుగుతున్నాయి. మిర్చి నర్సరీల సంఖ్య కూడా గతంతో పోలిస్తే ఈ ఏడాది 10శాతానికి పడిపోయింది. 

ధరలు చూసి పంటలు వేయొద్దు: పురుషోత్తం రావు, హార్టికల్చర్ ఎక్స్​పర్ట్

రైతులు మార్కెట్ ధరల ఆధారంగా పంటలు ఎంచుకోవడమే మిర్చి సాగు తగ్గడానికి ప్రధాన కారణమని హార్టికల్చర్ నిపుణులు పురుషోత్తం రావు అన్నారు. వాతావరణం, భూ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ధరలపై ఆధారపడి పంట నిర్ణయాలు తీసుకోవడం సరికాదని తెలిపారు. ధరలు బాగుంటే అందరూ మిర్చి సాగు చేస్తున్నారని, రేట్లు పడిపోతే వెనక్కి తగ్గుతున్నారని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు రైతులకు దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.