TCMA Note: అది మన తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుంది

TCMA Note: అది మన తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుంది

జయ జయహే తెలంగాణ(Jaya Jayahe Telangana) గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట‍్ర గీతంగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ పాటకి స్వరాలు సమకూర్చే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణికి అప్పగించింది ప్రభుత్వం. ఇదే విషయంపై ఇటీవల కీరవాణి ని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఈ విషయం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీస్తోంది. 

దీనిపై తాజాగా తెలంగాణ సినీ మ్యుజిషియన్స్ అసోసియేషన్ స్పందించింది. జయ జయహే తెలంగాణ పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని పేర్కొంది. ఈ నేపధ్యంలోనే ఒక నోట్ విడుదల చేసింది.. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియనిది కాదు. మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతోనే తెలంగాణ ఉద్యమం మొదలయింది. సకల జనుల సహకారంతో, ఎంతో మంది అమర వీరుల త్యాగల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

అంత గొప్పదైన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటం ఏంటి? అది మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. మన తెలంగాణాలో కూడా  ప్రతిభావంతులు ఉన్నారు. అందుకే ఈ గొప్ప అవకాశాన్ని మన తెలంగాణ కళాకారులకు ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని కోరుతున్నాం.. అంటూ ఓ నోట్ విడుదల చేసింది తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్. మరి ఈ ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.