తెలంగాణ సినిమాకు ​ఒరగబెట్టింది ఏమీ లేదు! : సయ్యద్ రఫీ

తెలంగాణ సినిమాకు ​ఒరగబెట్టింది ఏమీ లేదు! : సయ్యద్ రఫీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వగానే, అప్పటికే  అభివృద్ధి చెందిన తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడే స్థిరపడి ఉన్నా,  ప్రత్యామ్నాయ, సమాంతర,  తెలంగాణ  సినిమా పరిశ్రమ స్థాపన కోసం వివిధ సంఘాలు ఏర్పాటు చేసి, ప్రతిపాదనలు తయారుచేసి, అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో పెట్టించాం.  మేము ఇచ్చిన ఆరు డిమాండ్లలో నాలుగు డిమాండ్లు తన మేనిఫెస్టోలో  పొందుపరిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. సంతోషించాం. మేం పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయనుకున్నాం. 

అయితే, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కాని తలసాని శ్రీనివాస్ యాదవ్​కు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు కంగారుపడ్డాం.  వ్యవస్థ కోసం ఆయన వద్దకు వెళ్లి  తెలంగాణ సినిమా పాలసీ ప్రవేశపెట్టాలని మెమోరాండం ఇచ్చాం.  తెలంగాణ  రాష్ట్రంలో  కళా సంపదకు కొదవలేదు. కాబట్టి, మొట్టమొదట ఒక ఫిలిం ఇన్​స్టిట్యూట్ స్థాపించమన్నాం.  నేషనల్ ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్ లాగా..  తెలంగాణ ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి,  కథలను ఎంపిక చేసి తెలంగాణకు చెందిన నిర్మాతలతో  సహనిర్మాణం చేసి,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ప్రదేశాలను వెండితెరపై ఆవిష్కరించాలని కోరాం.  తెలంగాణకు చెందిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించమన్నాం. 

తెలంగాణ సినిమాలకు ప్రత్యేక షోలు

తెలంగాణ సినిమాలకు ప్రత్యేకంగా రెండు షోలు కేటాయించాలని,  బస్టాండ్లలో మినీ థియేటర్లును ప్రభుత్వమే నిర్మించాలని  లేదా  తెలంగాణకు చెందినవారు నిర్మించాలనుకుంటే రుణ సౌకర్యం కల్పించాలని చెప్పాం. తెలంగాణ సినిమాలను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్​కు,  అవార్డులకు  ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని పంపిస్తే  తెలంగాణ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందని వివరించాం. 

సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో  ఇచ్చినట్లుగా, ఈ తెలంగాణ సినిమాలకు పన్ను మినహాయింపు, సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించమని గత పాలకులకు విన్నవించాం.  ఔత్సాహికులు స్టూడియోలు కట్టడానికి,  తెలంగాణకు చెందిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు వసతి కోసం భూములు కేటాయించమన్నాం. అన్నింటికీ  ‘సరే’  అని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ .. మా ప్రతిపాదనల్లో  ఒక్క ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.  పైగా హైదరాబాద్​లో  జరిగే అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా  ఆపేశారు.  

అవార్డుల ముచ్చటే లేదు

తెలంగాణ ఉద్యమంలో తీసిన సినిమాల గురించి అస్సలు ప్రస్తావన తీయలేదు, గుర్తించలేదు!   2000 ఎకరాల  రాచకొండలో  ఫిలిం సిటీ స్థాపన గురించి రెండుసార్లు  ప్రకటించి వదిలేశారు.  ఆ ఫిలిం సిటీ  భూమి.. ఎటు పోతది?  ఇటు పోతదా?  అటు పోతదా?  స్పష్టత ఇవ్వమని అడిగితే,  ఏ స్పష్టత  ఇవ్వలేదు. మళ్లీ దాని ముచ్చటే తీయలేదు.  అదే  సీమాంధ్రకు  చెందిన  హై బడ్జెట్ సినిమాల వారికి,  టికెట్ పెంచమంటే  పెంచారు.  పన్ను మినహాయింపు  ఇవ్వమని  అడిగిన  వెంటనే  ఇచ్చేశారు.  ఆంధ్రోళ్ల సినిమాల ఫంక్షన్లకు ముస్తాబై వెళ్లారు.  అదే  తెలంగాణ వాళ్లు  తీసిన  సినిమాలకు  అసలు  ప్రోత్సహించలేదు.  

హీరోలకు తెలంగాణ భాష

సమాంతర,  ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా స్థాపన గురించి మేం అడిగినాం.  ఎలా అయితే  ముంబైలో  హిందీ సినిమా పరిశ్రమ ఉన్నప్పటికీ.. సమాంతరంగా మరాఠీ సినిమా పరిశ్రమను మహారాష్ట్ర ప్రభుత్వం స్థాపించుకున్నది. ఆ విధంగానే తెలంగాణ సినిమాను ప్రోత్సహించాలని కోరాం.  అసలు ఈ రంగంపై ఈ పదేళ్లలో ఒక్క ఇంచు మందం అభివృద్ధి కూడా జరగలేదు. 

రాష్ట్రం వేరుపడ్డాక సోషల్ మీడియాలో ఎవరికివారు ఆసక్తితో,  తెలంగాణ యాసలో, షార్ట్ ఫిలిమ్స్ రూపంలో,  పాటల రూపంలో తెలంగాణ కలలను ఆవిష్కరించుకున్నారు.  తద్వారా  సినిమాల్లో ఇప్పుడు  తెలంగాణ భాష  హీరోలకు వాడే స్థాయికి చేరుకున్నది. ఈ పరిణామం తెలంగాణ ప్రజలు స్వయంగా తెచ్చుకున్నది.  కానీ,  గత ప్రభుత్వం తెలంగాణ సినిమాకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తప్పకుండా తెలంగాణ సినిమా స్థాపన కలలను నెరవేరుస్తుందని ఆశిద్దాం!  

-  సయ్యద్ రఫీ,
సినిమా దర్శకుడు