నీతి ఆయోగ్ మీటింగ్​కు కేసీఆర్, కేజ్రీవాల్ దూరం

నీతి ఆయోగ్ మీటింగ్​కు కేసీఆర్, కేజ్రీవాల్ దూరం
  • ఇయ్యాల హైదరాబాద్​లో ఇద్దరు సీఎంల భేటీ
  • కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​పై కేసీఆర్​తో చర్చించనున్న కేజ్రీవాల్  
  • నీతి ఆయోగ్ మీటింగ్, పార్లమెంట్ బిల్డింగ్
  • ఓపెనింగ్​కు రావాలని కేసీఆర్​కు కేంద్రం ఆహ్వానం  
  • రెండు కార్యక్రమాలకూ సీఎం వెళ్తలే

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నీతి ఆయోగ్ మీటింగ్​కు వెళ్లడం లేదు. వీళ్లిద్దరూ శనివారం ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నారు. ఇద్దరు సీఎంలు ప్రగతిభవన్​లో భేటీ కానున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్​కు రానున్నారు. నేరుగా ఆయన ప్రగతి భవన్​కువెళ్లనున్నారు. అక్కడ కేసీఆర్​తో ఢిల్లీలో అధికారాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​పై చర్చలు జరపనున్నారు.ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఓటు వేయాలని కోరనున్నారు. 

వరుసగా రెండో ఏడాది పోతలే..

నీతి ఆయోగ్ మీటింగ్ తో పాటు ఆదివారం జరగనున్న పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ కు రావాలని కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కానీ ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ ఇంట్రస్ట్ చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాలకు రెండున్నరేండ్లుగా దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్.. వరుసగా రెండోసారి నీతి ఆయోగ్​మీటింగ్​కు వెళ్లడం లేదు. రాష్ట్రం తరఫున అధికారుల బృందాన్ని కూడా పంపడం లేదు. రాష్ట్ర ప్రజల అవసరాలను నీతి ఆయోగ్​ముందుంచి సాధించుకునే అవకాశం ఉన్నా రాజకీయ ప్రాధాన్యాల వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. నిరుడు ఆగస్టులో జరిగిన నీతి ఆయోగ్​మీటింగ్​కు వెళ్లలేదు. మీటింగ్​కు పోవట్లేదని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘‘నీతి ఆయోగ్ మీటింగ్​కు పోతే నాలుగు నిమిషాలే మాట్లాడాలే.. నాలుగు గంటలు కూసోవాలే.. అక్కడ ఇన్ని పుట్నాలు, ఇన్ని పల్లికాయలు, ఇన్ని కాజు పలుకులు అవ్వొకటి, ఇవ్వొకటి పెడ్తరు.. పొద్దుపోనోడల్లా అవి బుక్కుకుంటా కూసోవాలే.. గంతే.. ఇంకేం లేదు.. అందుకే ప్రొటెస్ట్​చేస్తే దేశమంతా చర్చ జరుగుతదని నిర్ణయించినం” అని అప్పట్లో కామెంట్ చేశారు. ఆ మీటింగ్​కు పోతే విమానం ఖర్చులు కూడా దండగ అని అన్నారు. ప్లానింగ్, ఫైనాన్స్​డిపార్ట్​మెంట్​అధికారులను కూడా మీటింగ్ కు వెళ్లనివ్వలేదు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులెవరూ మీటింగ్​కు హాజరుకావడం లేదు. ఇక పార్లమెంట్​కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవానికి కూడా పార్టీ తరఫున ఎవరూ హాజరు కావొద్దని కేసీఆర్ ఇప్పటికే​నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎంపీలకు తెలియజేశారు. దీనిపై అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం లేదని కేసీఆర్​తనను కలిసిన ఒక నాయకుడితో అన్నట్టు తెలిసింది.  

నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ, వెలుగు: నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీకి శుక్రవారం రెండు పేజీల లేఖ రాశారు. ‘‘ప్రధాన మంత్రి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండకపోతే, న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రజలు అడుగుతున్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజం ఒక జోక్ అయినప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం ఎందుకు’’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు.