ఫాక్స్‌‌కాన్‌‌కు సహకరిస్తం..కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్

ఫాక్స్‌‌కాన్‌‌కు సహకరిస్తం..కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్

 

  • పారిశ్రామికాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తం
  • ఇండస్ట్రీస్‌‌కు సులభంగా అనుమతులిస్తమని వెల్లడి
  • లక్ష మందికి ఉద్యోగాలిచ్చేలా ఫాక్స్‌‌కాన్‌‌తో ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: ఫాక్స్‌‌కాన్ కంపెనీ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కంపెనీ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌లో సీఎం రేవంత్ రెడ్డిని ఫాక్స్‌‌కాన్‌‌కు చెందిన హాన్‌‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తామని వివరించారు. 


పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభంగా అందించడంతో పాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వచ్చే రెండేండ్లలో 25 వేల ఉద్యోగాలు 

యాపిల్ ఐఫోన్, అనుబంధ పరికరాలు తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్​కాన్ సంస్థకు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్​లో గత ప్రభుత్వం సుమారు 120 ఎకరాలు కేటాయించింది. లక్ష ఉద్యోగాలు కల్పించేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో 550 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్​లో భూమి పూజ చేసింది. మొదటి దశలో భాగంగా వచ్చే రెండేండ్లలో 25,000 ఉద్యోగాలు కల్పించనుంది. మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఫాక్స్​కాన్ తెలిపింది. చైనా, వియత్నాం, థాయ్‌ల్యాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు), తెలంగాణ (కొంగర కలాన్), కర్నాటక (బెంగళూరు)లో ఈ సంస్థ పనిచేస్తున్నది.