పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు
  • అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం 
  • ప్రతినెలా 25 వేల పింఛన్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటన 
  • పద్మ అవార్డుల గ్రహీతలకు సర్కార్ ఆధ్వర్యంలో సన్మానం 
  • వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఆనందాచారి, కొండప్ప, సాంబయ్య, 
  • సోమ్లాల్, విఠలాచార్య, ఉమామహేశ్వరికి సత్కారం 

హైదరాబాద్, వెలుగు: కవులు, కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లేదంటే మన భాష, సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. భాష, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో రాష్ట్ర  ప్రభుత్వ ఆధ్వర్యంలో పద్మ అవార్డుల గ్రహీతలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సాంబయ్య, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య, ఉమామహేశ్వరిని సత్కరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఆరుగురికి రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. వీళ్లకు ప్రతినెలా రూ.25 వేల చొప్పున ప్రభుత్వం పింఛన్ కూడా ఇస్తుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే పద్మ​అవార్డుల గ్రహీతలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఇది ఇలాగే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. 

వెంకయ్య రాష్ట్రపతి కావాలి.. 

తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి వారికి వచ్చిన కళల్లో రాణిస్తున్న కళాకారులకు చప్పట్లు, దుప్పట్లే మిగులుతున్నాయని... ఆస్పత్రి ఖర్చులు, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేందుకు చార్జీలు కూడా లేక వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటోళ్లను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘వెంకయ్యనాయుడు, చిరంజీవిని సన్మానించుకోవడం అంటే మా పాలనకు ఆశ్వీరాదం లభించినట్టే. దేశంలో అత్యధిక దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఏకైక నాయకుడు వెంకయ్య. భవిష్యత్తులో ఆయన రాష్ట్రపతి పదవిని కూడా చేపట్టాలి” అని సీఎం ఆకాంక్షించారు. వెంకయ్య నాయుడు రిటైర్డ్ అయ్యాక ఢిల్లీలో తెలుగు నాయకత్వం తగ్గినట్టు అనిపిస్తోందని.. మనోళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఢిల్లీలో తెలుగు నేతలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒకట్రెండు సినిమాలు సక్సెస్ కాగానే గర్వపడే నటులున్న ఈరోజుల్లో 46 ఏండ్లు నిర్విరామంగా 150కి పైగా సినిమాలు చేసి కూడా నిగర్విగా ఉండడం ఒక్క చిరంజీవికే చెల్లిందని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

మట్టిలో మాణిక్యాలకు అవార్డులు..

కేంద్ర ప్రభుత్వం మట్టిలో మణిక్యాలకు పద్మ అవార్డులు ఇస్తున్నది. గత ప్రభుత్వాల్లో అవార్డులు ఎలా వచ్చేవో అందరికీ తెలుసు. నేను అవార్డులు కోరుకోను. కానీ ప్రధాని మోదీ మీద గౌరవంతోనే అవార్డును అంగీకరించాను. కేంద్రానికి, ప్రధానికి ధన్యవాదాలు. పద్మ అవార్డుల గ్రహీతలకు సన్మానం చేయడం మంచి పరిణామం. ఇందుకు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కండ్లయితే.. మూడో కన్ను చిరంజీవి. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు విలువలు పాటించాలి. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీలో నేతలు మాట్లాడుతున్న భాష బాగుండటం లేదు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినాలిటినే ఇప్పటి నేతలు నమ్ముకున్నారు. 
– ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

నంది అవార్డులకు గద్దర్ పేరు అభినందనీయం.. 

గత పదేండ్లుగా నంది అవార్డులు ఇవ్వకపోవటం బాధాకరం. అవార్డులు ఇస్తూ ఉంటే కళాకారులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. కళాకారులను ఏ రాజ్యం గౌరవిస్తుందో, ఆ రాజ్యం కళకళలాడుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్, భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. నంది అవార్డులు ఇస్తామని ఇటీవల సీఎం ప్రకటించడం గొప్ప విషయం. ఈ అవార్డులకు గొప్ప వ్యక్తి గద్దర్ పేరు పెట్టడం అభినందనీయం. ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్యనాయుడు ఎంతో బాధపడుతున్నారు. విమర్శలను తిప్పికొడితేనే రాజకీయాల్లో ఉండగలమని.. వ్యక్తిగత దూషణలు, దాడులు చేయడం మరింత పెరిగింది. 
– సినీ నటుడు చిరంజీవి