ఎంసీహెచ్ ఆర్డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్.!

ఎంసీహెచ్ ఆర్డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్.!
  • అక్కడే కొనసాగుతున్న నిర్మాణ పనులు
  • పైగా ప్యాలెస్ పరిశీలించిన సీఎస్, ఆఫీసర్లు
  • ప్యాలెస్ లోకి వెళ్లేందుకు రేవంత్ అయిష్టత
  • ప్రస్తుతం ఇంటి నుంచే విధులకు సీఎం
  • నిర్మాణం పూర్తవగానే ఎంసీహెచ్ఆర్డీకి చేంజ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నెల రోజులు దాటిపోయినా జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచే సెక్రటేరియట్ కు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. తన క్యాంప్ ఆఫీసు విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎంసీహెచ్ఆర్డీలోనే తన క్యాంపు ఆఫీసు ఏర్పాటు  చేసుకుంటారని సమాచారం.  నిన్నటి వరకు ‘పైగా ప్యాలెస్’ను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చనున్నారని ప్రచారం జరిగింది. సీఎస్ శాంతి కుమారి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇటీవలే ఈ ప్యాలెస్‌ను సందర్శించారు. ఈ ప్యాలెస్ సీఎం భద్రతకు సంబంధించి అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్యాలెస్ నుంచి సెక్రటేరియెట్ కు ఐదు నిమిషాల్లో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చేరుకోవచ్చని అధికారులు  భావించారు. ఈ ప్యాలెస్ సమీపంలో ఎలాంటి రెసిడెన్స్ ఏరియా లేకపోవడంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నివేదిక ఇచ్చారు. 

ప్యాలెస్ లోకి వెళ్లేందుకు విముఖత

ప్రజల పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్యాలెస్ లో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం ఇందుకు విరుద్ధమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అధికారులు పైగా ప్యాలెస్ ను పరిశీలించి రిపోర్ట్ అందించినా అక్కడ ఉండేందుకు ఆయన విముఖత వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తవని, ట్రాఫిక్ సమస్య ఉండదని అధికారులు చెప్పినా సీఎం విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

తాత్కాలిక స్ట్రక్చర్ నిర్మాణం

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం తాత్కాలిక  నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి మారుతారని తెలుస్తోంది.