గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. లోగో, విధివిధానాలు, నిబంధనల కోసం ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్ గా బి.నర్సింగ రావును ప్రభుత్వం నియమించింది.
కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు వ్యవహరించనున్నారు. అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వి.వెన్నెల, తనికెళ్ల భరణి, డి.సురేష్ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణ మూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లని శ్రీధర్, సానా యాది రెడ్డి, హరీష్ శంకర్, యల్దండి వేణు (‘బలగం’ చిత్ర దర్శకుడు) సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది.
గద్దర్ అవార్డులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్. వాగీశన్ అభిప్రాయం ఇది. ‘‘జీవితపు చివరి దశలో గద్దర్ తన శక్తిని తెలంగాణా ఉద్యమానికి, దళిత అస్తిత్వ పోరాటానికి, వాటి నుంచి ధిక్కార స్వరాలకు బాసటగా నిలిచాడు. ఇటువంటి మహా మనీషి పేరిట తెలంగాణా ప్రభుత్వం అవార్డు ఇవ్వాలి అని భావించడం మంచిదే. అయితే ఇప్పుడు సినిమా, నాటక సంబంధ రంగాలకు ఇస్తున్న నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డు ఇస్తాం అని సర్కారు వారు చెప్పడమే ఒకింత సమంజసంగా అనిపించడం లేదు.
సినిమా, నాటక రంగాలు గొప్పవే. అవి ఆధునిక కాలంలో ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసేవే. అయితే గద్దర్ ఎంచుకున్న కళా క్షేత్రానికి, కళాతత్వానికి, ఆచరణకు బాగా వ్యాపారమయం అయిపోయి విపరీత పోకడలు పోతున్న ఈ రంగాలకు పొంతన ఏమీలేదు. ఆయన వ్యాపార కళాకారుడు కాదు. చాలా ప్రయత్న పూర్వకంగా ఆ రంగానికి దూరంగా ఉన్న మనిషి ఆయన. చాలా చాలా పరిమితంగా మాత్రమే ఆయన జనరంజక సినిమా వైపు తొంగి చూశాడు’’ అని హెచ్. వాగీశన్ అభిప్రాయపడ్డారు.