Revanth Reddy: ఉత్తమ బాల నటిగా సుకృతికి జాతీయ అవార్డు.. సన్మానించిన సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth Reddy:  ఉత్తమ బాల నటిగా సుకృతికి జాతీయ అవార్డు.. సన్మానించిన సీఎం రేవంత్‌ రెడ్డి

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం (ఆగస్ట్ 19న) సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఇటీవలే “గాంధీ తాత చెట్టు” సినిమాకు గానూ ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డు పొందారు. ఈ సందర్భంగా సుకుమార్‌ కూతురు సుకృతిని సీఎం సన్మానించి అభినందించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ వెంట నిర్మాత యలమంచిలి రవిశంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. అయితే, 71వ జాతీయ అవార్డులకు ఎంపికైన పలు సినిమా మేకర్స్ నుసీఎం రేవంత్‌.. సోమవారం సత్కరించిన విషయం తెలిసిందే. 

“గాంధీ తాత చెట్టు” గురించి:

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్‌‌ రోల్‌‌లో పద్మావతి మల్లాది తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu). మైత్రీ మూవీ మేకర్స్‌‌, సుకుమార్‌‌ రైటింగ్స్‌‌, గోపీ టాకీస్‌‌ సంస్థలు నిర్మించాయి. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం 2025 జనవరి 24న థియేటర్లలలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. ‘మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించే ఓ చిన్నారి తన ఊరి కోసం ఏం చేసిందనేది ఆసక్తిగా చూపించారు. 

గాంధీ అనే అమ్మాయి, ఓ చెట్టు, దాన్ని నాటిన తాత చుట్టూ ప్రధానంగా సాగే సాగే క‌థ ఇది. గాంధీజీ సార‌థ్యంలో జ‌రిగిన ఉప్పు స‌త్యాగ్ర‌హంలాగే.. తన ఊరి కోసం, త‌న తాత నాటిన ఓ చెట్టు కోసం చిన్నారి గాంధీ  చేసిన మ‌రో స‌త్యాగ్ర‌హమే ఈ సినిమా.

చెట్ల‌కు ప్రాణం ఉంటుంద‌ని, ప్ర‌కృతిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌నే సందేశాన్ని సినిమా ద్వారా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి కల్పిస్తామని పల్లెటూర్లను మోసం చేస్తున్న వ్యాపారవేత్తలు, వారి మాటల వల్ల భూములు కోల్పోతున్న అమాయక రైతులను కళ్లకి కట్టినట్లు చూపించారు.