
వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 17 రోజులుగా కొనసాగుతోంది. దీంతో షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ , ఫెడరేషన్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు ముగింపు పలకాలని సూచించారు.
30 శాతం వేతనాలు పెంచాలంటూ కార్మికుల చేపట్టిన సమ్మెతో ఎక్కడికక్కడ సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిర్మాతలకు, కార్మికులకు నష్టం వాటిల్లుతోంది. కార్మికుల డిమాండ్లు, నిర్మాతల ప్రతిపాదనలపై ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా .. ఓ కొలిక్కి మాత్రం రాలేదు. అటు ఇరు వర్గాలతో మెగాస్టార్ చిరంజీవి చర్చలు జరుపుతున్నా.. ఫలితం మాత్రం రాలేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ , ఫెడరేషన్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయాలనే సర్కార్ ఆలోచనకు సమ్మె అడ్డంకిగా మారిందన్నారు. తెలంగాణ సినిమా పాలసీ పై కూడా సమ్మె ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.
తెలంగాణ సర్కార్ ఎంట్రీతో ఫిల్మ్ చాంబర్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు నిర్మాతలు, ఫెడరేషన్ తో ఫిల్మ్ చాంబర్ చర్చలు జరపనుంది. మరో వైపు ఫిల్మ్ పెడరేషన్ నేతలు అత్యవసరంగా సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి 24 క్రాప్ట్ యూనియన్ నేతలు హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై అంతర్గత సమావేశంలో చర్చిస్తున్నారు. నిర్మాతల ప్రతిపాదనలు, వేతనాలపై పెంపుపై చర్చించుకున్నారు. మరి రేపటి చర్చలతోనైనా ప్రతిష్టంభనకు ముగింపు పుడుతుందో లేదో చూడాలి మరి.