ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ మీటింగ్​

ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ మీటింగ్​
  •     28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు
  •     నేడు కలెక్టర్లకు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28  నుంచి వచ్చే నెల 6 వరకు (సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) ‘ప్రజా పాలన గ్రామసభలు’ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఎనిమిది రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. సభల నిర్వహణ, ప్రజా పాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం సెక్రటేరియెట్​లో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, ‘ప్రజా పాలన’ కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్​లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్​లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో  మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు.  ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు.

ప్రతి అప్లికేషన్​ కంప్యూటరీకరణ

ప్రజాపాలన గ్రామసభల కార్యక్రమానికి స్థానిక సర్పంచ్/ కార్పొరేటర్/ కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు.