ఇది పార్లమెంటు భవనంపైనే కాదు.. మన ప్రజాస్వామ్య విలువలపైన దాడి: సీఎం రేవంత్

ఇది పార్లమెంటు భవనంపైనే కాదు.. మన ప్రజాస్వామ్య విలువలపైన దాడి: సీఎం రేవంత్

పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్ సభలోకి ఇద్దరు అగంతకులు దూసుకొచ్చిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.  ఇది పార్లమెంటు భవనంపైనే కాదు.. మన ప్రజాస్వామ్య విలువలపైనా దాడి అని ట్వీట్ చేశారు.  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి..కారకులపై  కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కోరారు రేవంత్. 

డిసెంబర్ 13న సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్నం లోక్ సభలోకి ఇద్దరు నిందితులు  దూసుకొచ్చి స్ప్రే కొట్టి గందరగోళం సృష్టించారు. కొందరు ఎంపీలు నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు.  ఇద్దరు వ్యక్తులను సాగర్ శర్మ, మనోరంజన్‌లుగా గుర్తించారు. వీళ్లు  కర్ణాటకలోని మైసూరుకు చెందిన  బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా  విజిటింగ్ పాస్ తో లోపలికి వచ్చారని విచారణలో తేలింది.

మరో వైపు పార్లమెంట్‌ దాడి ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు తేల్చారు.. రెండు గ్రూపులుగా విడిపోయి ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు.  ఇప్పుటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న  మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారని చెప్పారు.