అసెంబ్లీ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా

అసెంబ్లీ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా

హైదరాబాద్ : పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్ వార్తలతో…అలర్టయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఇప్పటికే ఆసిఫిబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే… రేగా కాంతారావు పార్టీ వీడుతున్నట్టు ప్రకటన చేశారు. వీరి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే సమాచారంతో జాగ్రతపడుతున్నారు ముఖ్య నేతలు. అసెంబ్లీ కమిటీ హాల్లో అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో పాటు ఎమ్మెల్యేలు సీతక్క, హరిప్రియానాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పొడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి, వనమా, హర్షవర్థన్ రెడ్డి, సురేందర్, సీఎల్పీ భేటీకి హాజరయ్యారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నామని ప్రకటించడంతో ఏం చేయాలనే దానిపై భేటీలో చర్చించారు నేతలు. అటు ఈ నెల 12న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై మాట్లాడారు. పార్టీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేలకు తోడు టీడీపీకి ఉన్న ఇద్దరు సభ్యుల బలంతో… పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి గెలుస్తాడని ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నారు పీసీసీ ముఖ్య నేతలు. ఐతే ఇద్దరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతుండడం…. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించడంతో… గూడూరు నారాయణరెడ్డి గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది అధికార పార్టీతో టచ్ లో ఉన్నారనే వార్తలతో ఏం చేయాలనే దానిపై సమావేశంలో చర్చించారు. అటు సమావేశం ముగిసిన తర్వాత ….గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినాదాలు చేశారు.