- 14 సీట్లు గెలిచేందుకు మూడంచెలుగా సమన్వయ కమిటీలు
- అందుబాటులో ఉన్న ముఖ్య నేతలకు సీఎం దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా మల్కాజ్గిరి మోడల్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని సీట్లలో అదే మోడల్లో ముందుకు వెళ్లాలని లీడర్లకు, క్యాడర్‌కు నిర్దేశించినట్లు తెలిసింది. అందులో భాగంగా అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీతోనే పోటీ ఉందని, అదికూడా మూడు, నాలుగు స్థానాల్లోనే టఫ్ ఫైట్ ఉంటుందని సీఎం అన్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ 14 సీట్లు గెలిచేలా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు. ఇందు కోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు ఏర్పాటుచేసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలయ్యేంత వరకు ముఖ్యనేతలు అందరూ కలిసికట్టుగా బాధ్యతలు పంచుకోవాలని, కార్యకర్తలకు వెన్నంటి ఉండాలని సీఎం సూచించారు. అందులో భాగంగా ఒకటి రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి, ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు ఉండేలా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో బూత్ స్థాయి కమిటీల్లోనూ ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు అయిదుగురికి అవకాశం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. బూత్ కమిటీలో ఉండే అయిదుగురే ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని, ఈ ఎన్నికలకు వీరే సైనికులుగా నిలబడుతారని సీఎం తెలిపారు.
