అర్హులందరికీ ఆరు గ్యారంటీలు కచ్చితంగా అందిస్తాం: భట్టి విక్రమార్క

అర్హులందరికీ ఆరు గ్యారంటీలు  కచ్చితంగా అందిస్తాం: భట్టి విక్రమార్క
  • రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తం
  • మాది ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తం 
  • పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోమని వెల్లడి
  • అబ్దుల్లాపూర్‌‌మెట్‌లో ప్రజా పాలనను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు:  తమది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర సంపదను ప్రజ లకు అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడమే ప్రజాపాలన ఉద్దేశమని చెప్పారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్‌‌ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పేద కుటుంబాలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాయని అన్నారు. పదేండ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ప్రజాపాలన అని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారంటీలు

అర్హత కలిగిన ప్రతి ఒక్కరు 6 గ్యారంటీలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చని భట్టి సూచించారు. ‘‘సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు కచ్చితంగా అందిస్తాం. ఆరు గ్యారంటీల అమలుతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ కర్తవ్యం. ఎన్నికల ముందు ప్రకటించినట్టుగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసినం. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని నిరూపించినం” అని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన గంటలోపే.. అదే ప్రాంగణంలో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఉచిత ప్రయాణంతో లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో లబ్ధి జరుగుతున్నదని వెల్లడించారు.

ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారని భట్టి విక్రమార్క వివరించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని జనం కోరారని తెలిపారు. ‘‘ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలతో పాటు ప్రతి సంస్థ, వ్యవస్థ ‘నా కోసమే ఉంది’ అనే భావన ప్రతి పౌరుడికి కలిగించే బాధ్యతగా ఇందిరమ్మ రాజ్య పాలన ఉంటుంది” అని చెప్పారు. పాదయాత్రలో భాగంగా తాను అబ్దుల్లాపూర్ మెట్‌‌కు వచ్చినప్పుడు ఇండ్లు లేని పేదలు తనను కలిశారని, తమ ప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని నాడు మాట ఇచ్చానని గుర్తు చేశారు. ఆ ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారుడికి రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హన్మంతు, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.