- అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సీఎం, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కేరళ బాట
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేరళ బాట పడుతున్నారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నేతలు తరలివెళ్తున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నేతలు మాత్రం కేరళకు వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సొంత రాష్ట్రం కేరళ కావడం, అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడుస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కేరళలోనే కాంగ్రెస్కూటమికి విజయావకాశాలున్నాయని సర్వేలు కూడా చెప్పడం మరో కారణం. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కేరళ బాటపడుతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తోపాటు పలువురు యూత్, మహిళా, సేవా దళ్ నేతలు తరలివెళ్లారు. కేరళలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేరళ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అజారుద్దీన్ ఉన్న సంగతి తెలిసిందే.
