తెలంగాణ కాంగ్రెస్​లో సిట్టింగులకే టికెట్లు!

తెలంగాణ కాంగ్రెస్​లో సిట్టింగులకే టికెట్లు!
  •    ఒకే అప్లికేషన్ వచ్చిన సెగ్మెంట్లలోనూ అభ్యర్థులు ఫైనల్ 
  •     ఢిల్లీలో ఏడు గంటలకు పైగా సాగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ 

న్యూఢిల్లీ, వెలుగు :  సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్  స్ర్కీనింగ్ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. ఒకే అప్లికేషన్ వచ్చిన నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులనే ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇలా దాదాపు 35 నుంచి 40 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి, కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్​లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్​ మురళీధరన్ నేతృత్వంలో సమావేశం జరిగింది. 

ఇందులో బాబా సిద్ధిఖీ, జిగ్నేష్ మేవానీ, మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఎంపీలు ఉత్తమ్, వెంకట్​రెడ్డి, మధు యాష్కీ, ఏఐసీసీ సెక్రటరీలు పీసీ విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, రోహిత్ చౌదరి పాల్గొన్నారు. భేటీ అర్ధరాత్రి 12 గంటల వరకు 7 గంటల పాటు సాగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉన్న, ఒకే అప్లికేషన్ వచ్చిన, ఎలాంటి వివాదాలు లేని సెగ్మెంట్లపై చర్చించినట్లు తెలిసింది. 

మధిర నుంచి భట్టి, కొడంగల్ నుంచి రేవంత్, ములుగు నుంచి సీతక్క, మంథని నుంచి శ్రీధర్ బాబు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య పేర్లు చర్చకు రాగా.. అందరూ ఏకీభవించినట్లు సమాచారం. హుజూర్​నగర్ నుంచి ఉత్తమ్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేర్లను పరిశీ లనలోకి తీసుకున్నట్లు తెలిసింది. నెలాఖరులో ఈ లిస్ట్​ను అధికారికంగా రిలీజ్ చేయాలని కమిటీ నిర్ణయించింది.