- ..అక్కడ మన వడ్లకు ఫుల్ డిమాండ్
- క్వింటాలుకు 2,700 నుంచి 3వేల వరకు ధర
- జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు తగ్గిన వడ్లు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో పండించిన వడ్లకు కర్నాటకలో మంచి డిమాండ్ ఉన్నది. ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీలలో వడ్లు, బొలెరోల్లో పత్తి కర్నాటకకు వెళ్తున్నాయి. కల్లాల దగ్గరకే కర్నాటక నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేస్తున్నారు.
మద్దతు ధర కన్నా కర్నాటకలో ఎక్కువ రేటు రావడంతో మన రైతులు కూడా అక్కడి వ్యాపారులకే వడ్లు విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ వడ్లకు 2,389 రూపాయలు చెల్లిస్తున్నది, సాధారణ వడ్లకు క్వింటాలుకు 2,369 రూపాయలు చెల్లిస్తున్నది. సన్నవడ్లకు అదనంగా 500 రూపాయలు బోనస్ కూడా చెల్లిస్తామని చెబుతున్నది.
కానీ కర్నాటక వ్యాపారులు 2,700 నుంచి 3వేల వరకు కొంటున్నడంతో మన రైతులు వారికి అమ్మకాలు చేస్తున్నారు. అక్కడ వ్యాపారులు ఇక్కడికే వచ్చి కొంటున్నాడంతో ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా మిగిలిపోతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాలకు వడ్లు రావడం గణనీయంగా తగ్గింది. పత్తి కొనేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొర్రీలు పెట్టడంతో రైతులు ఎక్కువగా పత్తిని అమ్ముకునేందుకు కర్నాటకకే తరలి వెళ్తున్నారు.
ఇప్పటికీ 9 వేల మెట్రిక్ టన్నులే కొన్నారు
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 84 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఇప్పటివరకు 80 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 9వేల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు.
దీన్నిబట్టి చూస్తే పెద్ద ఎత్తున కర్నాటక కు ధాన్యం తరలి వెళ్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. కొనుగోలు కేంద్రాలకు కేవలం బీపీటీ రకం వడ్లు మాత్రమే వస్తున్నాయి. ఆర్ ఎన్ ఆర్ వడ్లు అసలు రైతులు తీసుకురావడం లేదు. కొనుగోలు కేంద్రాలకు ఒకవేళ రైతులు వడ్లు తీసుకొచ్చిన తేమ శాతం ఉందని కేంద్రాల వద్ద లేట్ చేస్తున్నారు. అదే కర్నాటక వ్యాపారులు కళ్లాల దగ్గరికి వచ్చే కొనుగోలు చేస్తున్నడంతో రైతులకు ఈజీగా పని అయిపోతున్నది.
ఆర్ఎన్ఆర్ వడ్లకు భలే డిమాండ్
జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్ఎన్ఆర్ తోపాటు బీపీటీ రకపు వడ్లను పండిస్తున్నారు. కర్నాటకలో ఆర్ఎన్ఆర్ వడ్లకు మంచి డిమాండ్ ఉన్నది. జోగులాంబ గద్వాల జిల్లాకు అక్కడ వ్యాపారులు వచ్చి ఆర్ఎన్ఆర్ రకపు వడ్లను మద్దతు ధర కన్నా ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించినప్పటికీ దానికన్నా 50 రూపాయలు నుంచి 100 రూపాయలు ఎక్కువ ధర వస్తున్నడంతో రైతులు వారికే అమ్మకాలు చేస్తున్నారు.
మాట వినని సీసీఐ
సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని ఆఫీసర్లు చెప్పినప్పటికీ సీసీఐ మాట వినడం లేదు. పెద్ద మొత్తంలో పంట పండించిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా తేమశాతం ఎక్కువగా ఉందని పత్తి సరిగా లేదంటూ సిసిఐ ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తున్నాడంతో వారు కూడా కర్నాటకకు తీసుకెళ్లి పత్తిని అమ్ముకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాలకు వడ్లు తగ్గాయి
కొనుగోలు కేంద్రాలకు వడ్లు తగ్గిన మాట వాస్తవమే. బహిరంగ మార్కెట్లో వడ్ల రేటు ఎక్కువగా ఉండడంతో కర్నాటక నంద్యాల తదితర ప్రాంతాలలో వడ్లను అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు 9వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశాం. రాబోయే రోజుల్లో ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నాం.– స్వామి కుమార్, డీఎస్ఓ, గద్వాల.
