
- టీఎస్ బీపాస్‌లో బోర్, తాత్కాలిక కరెంట్ కనెక్షన్ పర్మిషన్ ఇవ్వండి
- సీఎస్‌కు క్రెడాయ్, బిల్డర్స్, రియల్‌ఎస్టేల్ రంగ ప్రతినిధుల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లోని కొన్ని అంశాలు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని క్రెడాయ్, నారెడ్కో, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే వరకు మున్సిపల్ శాఖలో కమిటీ వేసి ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లోని పలు అంశాలను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇతర పరిశ్రమల మాదిరిగానే నిర్మాణ స్థలంలో తాత్కాలిక వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ అనుమతితో పాటు టీఎస్ బీపాస్ కింద బోర్‌వెల్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా, భవన నిర్మాణానికి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కూడా టీఎస్ బీపాస్ అప్లికేషన్లో భాగంగా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం గురువారం సెక్రటేరియెట్‌లో సీఎస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా బిల్డర్స్, రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎస్‌కు వివరించారు. వాటిని త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆఫీసులో టెక్నికల్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సాధారణ సిస్టమ్ వైఫల్యాన్ని నివారించడానికి ప్రస్తుత, భవిష్యత్ సిస్టమ్‌లకు అనుగుణంగా టీఎస్ బీపాస్‌లో ఇప్పటికే ఉన్న ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని సీఎస్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి విధానపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ, సీసీఎల్‌ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.