- టెక్నాలజీ ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు లోపం
- అమలుకు నోచుకోని శాటిలైట్ సర్వే ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్ ముగిసినా రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) ఇప్పటికీ పూర్తికాలేదు. రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ సర్వే నత్తనడకన సాగుతుండటంతో రైతులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సర్వే నంబర్, సబ్ సర్వే నంబర్ వద్దకు వెళ్లి పంటల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండటంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. సీజన్ పూర్తై పంట కోతలు ముగిసినా ఇప్పటికీ సర్వే పూర్తికాకపోవడం వ్యవసాయ శాఖ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తున్నారు. రైతు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశాడో కచ్చితంగా నమోదు చేసేందుకు డీసీఎస్ యాప్ వినియోగిస్తున్నారు.
అయితే సర్వే విధానం పూర్తిగా ఫీల్డ్ ఆధారంగా ఉండటంతో వేగం కనిపించడం లేదు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, వేలాది సర్వే నంబర్లలో పంట వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ తాత్కాలికంగా సుమారు 9,500 మంది ఎన్యుమరేటర్లను నియమించింది. ఒక్కో సబ్ సర్వే నంబర్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేసినందుకు రూ.7 చొప్పున చెల్లిస్తోంది. అయినప్పటికీ ఇప్పటివరకు 80 శాతం సర్వే కూడా పూర్తికాలేదని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు.
ఫీల్డ్‌కు వెళ్లకుంటే యాప్ పనిచేయదు..
డిజిటల్ క్రాప్ సర్వేలో ప్రతి సర్వే నంబర్‌కు 25 మీటర్ల పరిధిలోనే ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. దూరం నుంచి ఫొటో తీస్తే యాప్ అంగీకరించదు. దీంతో ప్రతి పొలం వద్దకు వెళ్లి పంట ఫొటోలు తీసి, పంట రకం, విస్తీర్ణం, రైతు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. గ్రామాల్లో సబ్ డివిజన్లు అధికంగా ఉండటం, సాంకేతిక పరిజ్ఞానంపై కొత్త ఎన్యుమరేటర్లకు అవగాహన తక్కువగా ఉండటం ఆలస్యానికి కారణమవుతోంది. గతంలో కొంతమంది వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది రైతుల వద్ద సమాచారం తీసుకొని ఫీల్డ్‌కు వెళ్లకుండానే పంటల వివరాలు నమోదు చేయడంతో కేంద్రం, రాష్ట్రం వద్ద ఉన్న సాగు లెక్కల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. దీంతో కచ్చితమైన పంటల నమోదు కోసం కేంద్రం డిజిటల్ సర్వేను తప్పనిసరి చేసింది.
టెక్నాలజీ ఉన్నా వినియోగం నత్తనడకే
వ్యవసాయ శాఖ ఇప్పటికే జియోఫెన్సింగ్, జీటీ పాయింట్లు, శాటిలైట్ ఆధారిత సర్వే వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలుకావడం లేదు. సర్వే నంబర్ వద్దకు వెళ్లినప్పుడే యాప్ ఓపెన్ అయ్యేలా కొత్త మాడ్యూల్‌ను రూపొందించారు. గూగుల్ మ్యాపింగ్, శాటిలైట్ లొకేషన్ ఆధారంగా 300 మీటర్ల పరిధిలోని పంటల వివరాలు నమోదు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడంతో సర్వే వేగం పెరగడం లేదు.
అమలు కాని శాటిలైట్ సర్వే ప్రతిపాదనలు
వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలోనే శాటిలైట్ ఆధారిత పంటల సర్వే ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. క్లస్టర్ల వారీగా ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటల విస్తీర్ణం గుర్తించి, గ్రౌండ్ ట్రూత్ పాయింట్లతో ధ్రువీకరించే విధానాన్ని సూచించింది. ఈ పద్ధతి అమలులోకి వస్తే తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా పంటల పూర్తి వివరాలు నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆ ప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకాకపోవడంతో పాత విధానానికే అధికారులు పరిమితమయ్యారు.
రైతులకు ఇబ్బందులు
పంటల నమోదు ఆలస్యమైతే రైతుబంధు, రైతుబీమా, పంట నష్టం అంచనాలు, బీమా క్లెయిమ్‌లు, కొనుగోలు ప్రక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే ఆధారంగానే భవిష్యత్‌లో పంటల బీమా, విపత్తు సాయం, మార్కెటింగ్, ఎగుమతుల ప్రణాళికలు రూపొందించే అవకాశముండటంతో సర్వేను వేగంగా పూర్తి చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
