ఘనంగా ఓటరు దినోత్సవం

ఘనంగా ఓటరు దినోత్సవం

యాదాద్రి, వెలుగు:  ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించడంతో పాటు వినియోగించుకోవాలని అడిషనల్​ కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.  జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా భువనగిరిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. కొత్త ఓటర్లకు ఎన్నికల గుర్తింపు కార్డు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇతర ఆఫీసర్లు ఉన్నారు. 

సూర్యాపేట: 18 సంవత్సరాలు నిండిన  ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.  ఆదివారం కలెక్టరేట్‌లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల  దినోత్సవాన్ని ఓటర్లలో అవగాహన కల్పించడానికీ, ఎన్నికల ప్రక్రియలో సమాచారంతో కూడిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జరుపుకుంటామని తెలిపారు. సూర్యాపేట ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బంది స్కూల్, కాలేజీ  విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్ ఎస్ ఎస్ క్యాడెట్లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కె సీతారామారావు, ఆర్డీవో వేణుమాధవ్, డీఈఓ అశోక్, తదితరులు పాల్గొన్నారు. 

నల్గొండ అర్బన్, :  ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమని నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. 16 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దేశంలో యంగ్ ఇండియన్స్ ను చైతన్యం చేసేందుకు  ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలోని ప్రతి ఓటరును నమోదు చేసి ఎస్ఐఆర్ 74 శాతం పూర్తి చేసినందుకు జాతీయస్థాయిలో అవార్డు రావడం పట్ల ఈఆర్వోలను, బీఎల్ఓ లను అభినందించారు.

విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరక ‘సండే సైకిల్’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.  రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, ఈఆర్వోలు , బిఎల్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.

హుజూర్ నగర్: ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదని ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత అన్నారు.ఆదివారం హుజూర్ నగర్ లో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఓటు హక్కును ఉపయోగించుకోవడం దేశానికి సేవ చేయడం లాంటిది అన్నారు. కార్యక్రమంలో ఎస్సై బండి మోహన్ బాబు,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,డిప్యూటీ తహసిల్దార్ కత్తుల నాగేందర్,ఎంపీడీవో సుమంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.