
- బనకచర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదాద్రి, వెలుగు : పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వని బీఆర్‌ఎస్ తెలంగాణకు అవసరం లేదని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో బుధవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులకు వడ్డీలు కట్టడమే ఇప్పుడు భారంగా మారిందన్నారు. ఓ వైపు వడ్డీలు కడుతూనే.. మరో వైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ క్యాండిడేట్ల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సాగు నీటి ప్రాజెక్టలకు అవసరమైన భూసేకరణను పూర్తి చేస్తామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ అంశం ఎజెండాలో పెడితే చర్చల్లో పాల్గొనబోమని కేంద్రానికి చెప్పామన్నారు. మూడుసార్లు కేవలం మూడు వేల ఓట్లతో గెలిచిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురి తాను కామెంట్ చేయబోనన్నారు.